నష్టపోయేది కేసీఆర్ మాత్రమేనట

ఇప్పుడు కూడా మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు విన్పిస్తున్నాయి.;

Update: 2021-12-22 13:25 GMT

తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు జరగుతాయా? గతంలో మాదిరి ఏడాది ముందే ఎన్నికలు వస్తాయా? అంటే అవుననే అంటున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన మాటలను తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే హోంమంత్రి కాబట్టి. ఆయనకుండే సోర్సెస్ మామూలువి కావు. ఇటు ఇంటలిజెన్స్ రిపోర్టులతో పాటు ప్రత్యేకంగా ఆయనకు నివేదికలు వివిధ రాష్ట్రాల నుంచి అందుతుంటాయి. అందుకే అమిత్ షా మాటలను కొట్టిపారేయలేం అనాల్సి వస్తుంది.

గత ఎన్నికల్లో....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల విషయంలో ఇదే చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2019లో జరగాల్సిన ఎన్నికలను 2018లోనే జరిపించుకున్నారు. ఇది ఆయనకు అడ్వాంటేజీగా మారింది. 2014 ఎన్నికల కంటే అత్యధిక స్థానాలను సాధించి మరోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు విన్పిస్తున్నాయి.
ప్రత్యర్థులు బలపడక ముందే....
కేసీఆర్ కు ఒక అలవాటు ఉంది. ప్రత్యర్థి పార్టీలు బలపడక ముందే ఎన్నికలకు వెళతారు. అన్ని రకాలుగా విపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళితే తనకు అడ్వాంటేజీ అని కేసీఆర్ భావిస్తారు. ఇది గత ఎన్నికల్లో నిజమైంది. విపక్ష పార్టీలు అభ్యర్థులను సెట్ చేసుకోవడానికే సమయం సరిపోయేది. ఇక ప్రచారానికి పెద్దగా సమయం ఉండేది కాదు. ఈసారి కూడా అదే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారని, అది తెలిసే అమిత్ షా పార్టీ నేతలను హెచ్చరించి ఉండవచ్చు.
లాభిస్తాయా?
కానీ కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు ఈసారి లాభిస్తాయా? అంటే చెప్పలేని పరిస్థిితి. ఎందుకంటే గతంలో లేని అసంతృప్తి కేసీఆర్ పాలనపై ఉంది. దీంతోపాటు కేసీఆర్ హామీ ఇచ్చిన అనేక పథకాలు గ్రౌండ్ కావాల్సి ఉంది. దళితబంధు పథకం ఇంకా ఒక నియోజకవర్గంలోనూ పూర్తికాలేదు. దళితబంధుతో పాటు బీసీ బంధు, మైనారిటీ బంధు పథకాలను ప్రవేశ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ 2022లో ఎన్నికలకు వెళితే ఆ సమయం సరిపోదు. నిజానికి 2023లో జరగాల్సిన ఎన్నికలను ఒక ఏడాది ముందుగా వెళితే నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. అందుకే విపక్షాలు ముందస్తు ఎన్నికలనే కోరుకుంటున్నాయి.


Tags:    

Similar News