జగన్ ట్విస్ట్ ఇదేనట.. త్రీ క్యాపిటల్స్ తగ్గేదేలే...?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మనస్తత్వం అందరికీ తెలుసు. ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గే అవకాశం ఉండదు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మనస్తత్వం అందరికీ తెలుసు. ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. గత పన్నెండేళ్లుగా జగన్ ను చూస్తున్న వారు ఎవరైనా ఇదే చెబుతారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా జగన్ వెనక్కు తీసుకోరంటారు. తాజాగా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అంటే ప్రభుత్వ ఆలోచన మేరకే ఏజీ హైకోర్టుకు తెలిపారనుకోవాలి.
అంత సులువుగా....
అయితే జగన్ అంత సులువుగా మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేదంటున్నారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించి గతంలో ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కు తీసుకున్నట్లు తెలిసింది. అందుకే ఈ బిల్లులను జగన్ వెనక్కు తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు అంశం పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. అందుకే హడావిడిగా బిల్లులను వెనక్కు తీసుకున్నారు.
న్యాయపరమైన ఇబ్బందులు....
పాత బిల్లుల స్థానంలో కొత్త బిల్లులను జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త బిల్లులను శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదిస్తాయి. తాజా బిల్లులపై విచారణ చేసే అవకాశం హైకోర్టుకు లేదని, దాని పరిధిలోకి తాజా బిల్లులు రావని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకే పాత బిల్లులను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు తెలిసింది. మూడు వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదు. కొత్త బిల్లులను పెట్టి మరోసారి జగన్ ట్విస్ట్ ఇవ్వనున్నారు. జగన్ మరికాసేపట్లో మూడు రాజధానులపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.