నల్లారి వారందరినీ కట్టకట్టుకుని తీసుకెళతారా?
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరారు. తనకు పరిచయమున్ననేతలను బీజేపీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు;
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరారు. సరే ఆయన మల్కాజ్ గిరి పార్లమెంటుకు పోటీ చేస్తారని, తెలంగాణ రాజకీయాల్లో కూడా ఉంటారని చెబుతున్నప్పటికీ ముఖ్యంగా ఆయన పాలిటిక్స్ అంతా ఏపీ నుంచే మొదలు పెట్టనున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ ఏపీలో బీజేపీ బలోపేతం కాలేదు. చేరికలు కూడా లేవు. ఉన్న నేతలు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ఏంటో నిరూపించుకోవాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలిసింది. అందుకోసం వేగంగా ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
స్పీడ్ పెంచినట్లేనా?
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్ లో చేరి కూడా చివరకు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన వెంటనే కాంగ్రెస్ మాదిరి మౌనంగా ఉంటే సరిపోదు. అందుకు తగిన కృషి చేయాల్సి ఉంటుంది. హైకమాండ్ దృష్టిలో ముఖ్యంగా మోదీ, అమిత్ షా దృష్టిలో వేగంగా పడాలంటే స్పీడ్ గానే ఉండాలి. గత ఎనిమిదేళ్లుగా విశ్రాంతి తీసుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక యాక్టివ్ అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఏపీలో ఎక్కువ పర్యటించాలని కూడా నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఆయన ఏపీలో పర్యటిస్తారని కూడా తెలిసింది. అయితే అంతకు ముందుగా ఢిల్లీలో ముఖ్యనేతలను పార్టీలో చేర్చేందుకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
హైకమాండ్ వద్ద...
నేతలను ఎక్కువమందిని చేర్పించగలిగితే తన పైన నమ్మకం ఏర్పడి పొత్తుల విషయంలో కూడా హైకమాండ్ వద్ద తనమాట నెగ్గుబాటు అవుతుందన్నది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన. ఏపీలో కాంగ్రెస్ ఇక కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. సీనియర్ నేతలందరూ ఖాళీగానేే ఉన్నారు. ఇటు వైసీపీలోకి వెళ్లలేక, టీడీపీలో చోటు లేక అనేక మంది నేతలు రాజకీయంగా ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలను గుర్తించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వారిని పార్టీలో చేర్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది. నల్లారితో ఉన్న అనుబంధం కారణంగా వారిలో కొందరు బీజేపీలో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఫోన్ లోనే సంప్రదింపులు...
ఇందులో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు బీజేపీలో చేరేందుకు రెడీ చెప్పినట్లు సమాచారం అందుతుంది. పల్లంరాజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బలమైన నేత. ఆయన చేరికకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక రాయలసీమ నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ శైలజానాధ్, రఘువీరారెడ్డిలతో కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కొందరు అంగీకరించినా మరికొందరు మాత్రం ఆలోచించుకుని నిర్ణయం చెబుతామని నల్లారికి తెలిపినట్లు సమాచారం. అయితే నల్లారి మాత్రం బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని భరోసా ఇస్తున్నారని, గతంలో తాను కాంగ్రెస్ లో ఉండగా సన్నిహితులైన వారందరికీ నల్లారి ఫోన్ ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇందులో జీవీ హర్షకుమార్ కూడా ఉన్నారంటున్నారు. మరి చివరకు ఎవరు చేరతారన్నది చూడాలి.