ఉత్తమ్ స్లిప్ అయ్యారా? కాన్ఫిడెన్స్‌తో అన్నారా?

మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో సంచలనంగా మారాయి

Update: 2023-01-07 04:06 GMT

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజకీయ వారసులు ఎవరూ లేరు. ఆయన పైలట్ గా పనిచేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1994లో ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి వరకూ కోదాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983, 1985, 1989, 1994లో వరసగా టీడీపీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఉత్తమ్ దశ తిరిగింది. 1999, 2004లో ఆయన అదే కోదాడ నుంచి గెలుపొందడటం విశేషం.


హ్యాట్రిక్ విజయాలు సాధించి...

ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009లో హుజూర్ నగర్ కు షిఫ్ట్ అయ్యారు. తన భార్య పద్మావతిని కోదాడలో 2014లో పోటీకి దింపి గెలిపించుకున్నారు. తాను మాత్రం 2009, 2014, 2018 లో హుజూర్ నగర్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో దంపతులిద్దరూ వేర్వేరు నియోజకవర్గాల నుంచి శాసనసభలోకి అడుగు పెట్టారు. 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ నుంచి ఎన్ఆర్ఐ సైదిరెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది. తన భార్య పద్మావతిని బరిలోకి దింపినా ఉప ఎన్నికల్లో మాత్రం ఉత్తమ్ భార్య గెలవ లేకపోయారు.
రెండు చోట్ల ఓడిపోయి...
2018 ఎన్నికల్లోనూ తన భార్య పద్మావతికి కోదాడ టిక్కెట్ దక్కినా ఆమె టీఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. బొల్లం మల్లయ్య యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. టీఆర్ఎస్ లోకి జంప్ అయి విజయం సాధించారు. ఇలా ఉత్తమ్ భార్య పద్మావతి 2018లో కోదాడ నుంచి, 2019లో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. అయితే మరోసారి దంపతులు ఇద్దరూ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. నో డౌట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెండు నియోజకవర్గాలలో మంచి పేరుంది. ఆ రెండు నియోజకవర్గాల్లో వారు తప్ప కాంగ్రెస్ కు మరో బలమైన నేత కూడా లేరు.

మళ్లీ దంపతులిద్దరికీ...
ిఒకరిద్దరు మేమున్నామంటూ ముందుకు వస్తున్నా టీఆర్ఎస్ ను ఎదుర్కొనాలంటే ఉత్తమ్ కుటుంబమే రెండు చోట్ల పోటీ చేయాలన్న డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఉత్తమ్ కూడా అదే భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన చేసిన లెటెస్ట్ కామెంట్స్ రెండు నియోజకవర్గాల్లో కాక రేపుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం తనకు వర్తించవన్న రీతిలో ఉన్నాయి. ఆయన తాజాగా వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడలో తామే పోటీ చేస్తామని ప్రకటించారు. హుజూర్ నగర్ లో ఈసారి యాభై వేల మెజారిటీ గెలవలేకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. యాభై వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. కానీ కాంగ్రెస్ లో కూడా ఒక్క కుటుంబానికి ఒకే టిక్కెట్ అని రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు. మరి ఉత్తమ్ ఇది తెలిసి కూడా మాట స్లిప్ అయ్యారా? తమకే టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో చెప్పారా? అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ తన పెట్టుకున్న నిబంధనను తానే అతిక్రమించి ఉత్తమ్ కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News