'గాయపడ్డ' గద్దర్ !
గద్దర్ ఒక బ్రాండ్.కానీ గాయపడ్డ మనిషి.ఆయన ఒక తెరచిన పుస్తకం.భోళా శంకర్.పాటను తూటాలా మలచిన శిల్పి
'గాయపడ్డ' గద్దర్ !
గద్దర్ ఒక బ్రాండ్.కానీ గాయపడ్డ మనిషి.ఆయన ఒక తెరచిన పుస్తకం.భోళా శంకర్.పాటను తూటాలా మలచిన శిల్పి.దళితునిగా,విప్లవకారునిగా,అంబేద్కరిస్టుగా.. అనేక మలుపుల్లో ఆయన గాయపడ్డాడు.ఓటు వేసినా,గుడికి వెళ్లినా,రాహుల్ గాంధీని కలిసినా,చంద్రబాబును కౌగిలించుకున్నా తన చర్యలను సమర్ధించుకున్నాడు తప్ప రాజీ పడలేదు.ఆయన ఎట్లా జీవించాలని అనుకున్నారో అట్లాగే జీవించారు.ఏది నమ్మారో అదే చేశారు.విమర్శలు,వివాదాలు చుట్టుముట్టినా వెనుదిరగకుండా ఆడి,పాడి,అలసి సొలసి 75 ఏళ్ల వయసులో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.
కార్ల్ మార్క్స్ తో పాటు అంబేద్కర్,పూలేను కూడా అనుసరించవలసిందే అన్నందుకు మావోయిస్టు పార్టీ ఆయనను బయటకు పంపింది.1972 నుంచి 2012 వరకు గద్దర్ మావోయిస్టు పార్టీ సభ్యుడు.కులం వేరు.వర్గం వేరు.అందుకే క్లాస్ వార్ ,క్యాస్ట్ వార్ అని అంటుంటాం .కులవ్యవస్థ ఉన్న భారతదేశంలో మధ్యేమార్గంలో ఒక సామాజిక విప్లవం రావాలంటే ఓటు చాలా అవసరం అని గద్దర్ వాదన.మార్క్స్, అంబేడ్కర్ ఇద్దరి మార్గాలూ వేర్వేరు. ఆ రెంటినీ పట్టాలపైకి ఎక్కించాలని ఆయన ప్రయత్నించారు.భారత కుల వ్యవస్థపై కమ్యూనిస్టు పార్టీలకు స్పష్టమైన అవగాహన రాలేదని ఆయన విమర్శ.యాబై సంవత్సరాల ప్రయాణం,32 కేసులు,6 తుపాకీ గుండ్లు,అజ్ఞాతవాస జీవితం, జైలు జీవితం, సర్వస్వం త్యాగం చేయటం...ఇదీ స్థూలంగా గద్దర్.
''సాయుధ పోరాటం ఒకటే కాదు,సంధి కాలంలో,యుద్ధంలో డిఫెన్స్‌లో ఉన్నపుడు,ఓటింగ్ విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న నా వాదనను పార్టీకి చెప్పాను.అందుకు వారు అంగీకరించలేదు.మార్క్సిజం,లెనినిజం,మావోయిజం సిద్ధాంతం మీదనే పని చేస్తాం అన్నారు.అందుకే, ఆ పార్టీకి నమస్కారం పెట్టి బయటకు వచ్చాను.పార్టీ లో కులం గురించి చాలా చర్చలు జరిపాం.నేనే మొదటి వాడిని కాదు.చాలా చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది'' అని గద్దర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.''పార్టీ నిబంధనావళికి విరుద్ధంగా పాలక,బూర్జువా పార్టీలతో చేతులు కలిపినందున 2012 లో షోకాజు నోటీసు ఇచ్చాం.ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు'' అని మావోయిస్టు పార్టీ అధికారప్రతినిథి జగన్ సోమవారం విడుదల చేసిన సంతాప ప్రకటనలో వివరించారు.
గద్దర్ 2018 లో తెలంగాణ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు.పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ,ఎన్నికలను బహిష్కరించే మావోయిస్టు పార్టీలో పనిచేసిన గద్దర్ తన 70 ఏళ్ళ జీవితంలో వోటు వేయలేదు.గద్దర్ ఓటు హక్కు వినియోగించుకోవడం అప్పట్లో ఒక సంచలనం.తనకు రాజకీయ తల్లి నక్సలైటు ఉద్యమం అని చాలాసార్లు గద్దర్ చెప్పేవారు.కార్ల్ మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతోపాటు పూలే, అంబేడ్కర్‌ల భావాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని అనుకున్నారు.'సాయుధ పోరాటం ఒక ఉద్యమ రూపం మాత్రమే' అని గద్దర్ గట్టిగా వాదించేవారు.
''దోపిడీ నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలంటే మార్క్స్ ఒక్కడే సరిపోడు.అంబేడ్కర్ కూడా అవసరం.ఈ ఇద్దరి జ్ఞాన సిద్ధాంతం,భావ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలి.ఓట్ల విప్లవం రావాలి. ఓటు కూడా ఒక పోరాట రూపం. రాజ్యాంగం ఒక పవిత్రమైన లీగల్ డాక్యుమెంట్. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారమే దేశం నడవాలి.అలా నడవట్లేదు.అలా నడిచేలా చేయాలి'' అని ఒక ఇంటర్వ్యూ లో గద్దర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
1997 లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గద్దర్ పై కాల్పులు జరిగాయి.ఆ కాల్పులు ఎవరు జరిపారో అప్పటి ప్రభుత్వంలోని ప్రముఖులకు,పోలీసు ఉన్నతాధికారులకు తెలుసు.ఆ కేసు పాతికేళ్ల తర్వాత కూడా అతీగతీ లేకుండా పోయింది.గద్దర్ కవి,రచయిత,గాయకుడు,విప్లవకారుడే కాదు.ఇంకా ఎన్నో కోణాలు ఆయనలో ఉన్నవి.ఆయనను ఒక చట్రంలో ఇమడ్చడం కష్టం.ఈ ధోరణి వల్లనే ఆయన పలు సందర్భాల్లో కోరి కోరి వివాదాలకు,విమర్శలు,నిందలకు గురయ్యారు.చంద్రబాబును ఆలింగనం చేసుకోవడాన్ని కూడా గద్దర్ సమర్ధించుకున్న తీరు ఆశ్ఛర్యం కలిగిస్తుంది.''చంద్రబాబును కౌగలించుకుంటే మీ శరీరంలోని బుల్లెట్లు కరిగిపోయాయా అని అడుతున్నారు? ఒక యుద్ధం జరుగుతున్నపుడు,యుద్ధంలోనూ,ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలిగించుకోవటం మానవీయ విలువ.చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై పోరాడుతున్నాడు.దానితో ఏకీభవించాను.ఐక్యతా పోరాటంలో చన్నీళ్లు, వేన్నీళ్లు ఉంటాయి.కనుక చంద్రబాబు నా మిత్రుడు'' గద్దర్ అప్పట్లో వ్యాఖ్యానించారు.నిజంగా తనపై హత్యాయత్నానికి పరోక్షంగా అయినా బాధ్యుడు అయిన చంద్రబాబు విషయంలో ఆయన మాత్రమే ఇలా సాహసంతో వ్యాఖ్యలు చేయగలరు.
అలాగే కేసీఆర్ విషయంలోనూ... తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సందర్భంలో గద్దర్ ఒక పాయలా ఉద్యమాన్ని నడిపారు.పాదయాత్ర చేశారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి ఆయనకు నచ్చలేదు.
''సామ్రాజ్యవాద ఫాసిజం,బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం దేశాన్ని పాలిస్తున్నాయి.వీటితో కేసీఆర్‌కు పొత్తు ఉంది.అయితే ఆ పొత్తు రహస్యంగా సాగుతోంది'' అని గద్దర్ నిప్పులు చెరిగారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు కూడా.'గద్దర్ ప్రజాపార్టీ' పేరిట ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుని,ఢిల్లీలో దరఖాస్తు చేసుకున్నారు.ఆ పార్టీ రిజిస్టర్ కాకమునుపే ఆయన కన్ను మూశారు.
'ది ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్'ను ఏర్పాటు చేయాలని ఒక దశలో గద్దర్ అనుకున్నారు.ప్రజాస్వామిక శక్తుల ద్వారా ఓటును,ఉద్యమాన్ని కలపాలని ఊహించారు. హిందీ,మలయాళీ,మరాఠీ,ఇంగ్లీష్ భాషల్లో పాటలు రాసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'వెయ్యి డప్పులు, లక్ష గొంతులు' అన్న నినాదంతో 'సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్'ను ప్రారంభించాలనుకున్నారు.అందుకోసం పవన్ కల్యాణ్, రజినీ కాంత్, కమల్‌హసన్ అందర్నీ కలవాలని ఆయన ప్రయత్నించారు.అది ఏ కారణంగానో సాధ్యం కాలేదు. 22 భాషల్లో పాటలు పాడగలిగిన ప్రతిభ గద్దర్ సొంతం.
'రేపటి కాలం మీది.. నా భుజాల మీద ఎక్కి ఈ ప్రపంచాన్ని చూడండి.. మీ సమాజాన్ని మీరే నిర్మించుకోండి ' అని గద్దర్ పిలుపునిచ్చారు.బహుశా అదే ఆయన చివరి మాట.
తాజా వార్తల కోసం telugupost.com ని అనుసరించండి