గంటా క్యాలిక్యులేషన్స్. వర్క్ అవుట్ అయితే?

గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరనియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి భీమిలీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.;

Update: 2021-12-23 02:42 GMT

ఏ నేతకైనా రాజకీయాల్లో బ్రేక్ ఉండదు. అన్ని రకాలుగా బలమున్న నేతలు అసలు విరామం కోరుకోరు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో ఇది వాస్తవమని చెప్పాలి. గంటా శ్రీనివాసరావు ఇటీవల కొంత యాక్టివ్ అయ్యారు. కొత్త ఏడాది నుంచి ఆయన మరింత జనంలోకి వెళ్లనున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కానీ ఈ మూడేళ్లలో గంటా శ్రీనివాసరావు తాను పోటీ చేయాలనుకున్న చోట గ్రిప్ సంపాదించుకోవాల్సి ఉంటుంది.

పార్టీకి దూరంగా....
గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి గెలవడం, ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన గత రెండున్నరేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడంలేదు. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఇన్ ఛార్జిని పెట్టుకుని పని లాగించేస్తున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి లేదు. గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేశారు.
భీమిలీ నుంచే....
అందుకే ఈసారి గంటా శ్రీనివాసరావు భీమిలీ నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ నియోజకవర్గం తనకు సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నారు. మరోసారి భీమిలీ నుంచి పోటీ చేస్తానని గంటా శ్రీనివాసరావు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటి వరకూ అయితే సస్పెన్స్. జనసేన నుంచి పోటీ చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉందంటున్నారు. భీమిలీలో జనసేన తరుపున పోటీ చేస్తే విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తు కుదురుతుందని గట్టిగా గంటా శ్రీనివాసరావు విశ్వసిస్తున్నారు.
కాపు కమ్యునిటీలో...
ఆయన ఇటీవల కాపు సామాజికవర్గం కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. రాబోయే ఎన్నికల కోసమే ఆయన ఈ స్టాండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి. అన్నీ లెక్కలు వేసుకుని గంటా శ్రీనివాసరావు భీమిలీ వైపు మరోసారి వెళుతున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావుపై అసంతృప్తి ఉండటం, టీడీపీలో కూడా బలమైన నేత లేకపోవడంతో తనకు జనసేన కరెక్ట్ అన్నది ఈ మాజీ మంత్రి గారి క్యాలిక్యులేషన్. మొత్తం మీద చాలా రోజుల తర్వాత గంటా శ్రీనివాసరావు యాక్టివ్ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News