జగనే సరైనోడు... ఉద్యోగులారా బహుపరాక్
ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. జగన్ ఇంకా తేల్చలేదు.;
ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. జగన్ ఇంకా తేల్చలేదు. గత పదిహేను రోజులుగా పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తు కొనసాగుతూనే ఉంది. అయితే జగన్ మైండ్ లో వేరే విధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లే కన్పిస్తుంది. అందుకే ఈ విషయాన్ని నానుస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఆందోళన చేస్తే అంత వారికే నష్టం. ఈ విషయం వారికి తెలియంది కాదు.
ప్రజల్లో వ్యతిరరేకత....
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా చేయాలని ప్రజలు కోరుకుంటారు. వారిలో కొందరు బాగానే పనిచేయవచ్చు. కానీ సింహభాగం ఉద్యోగులు మాత్రం ప్రజలకు దూరంగా ఉంటున్నారు. లంచం ఇవ్వనిదే పని చేయరన్న అపప్రధ వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. ఫైలు ముందుకు కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. ప్రజల్లో వీరి పట్ల చులకనభావం ఏర్పడటానికి ఇది ఒక కారణం. అందుకే ఎప్పటి నుంచో ప్రభుత్వోద్యోగులు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
మొండోడు కావడంతో...
ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెలను తీర్చేందుకు ఏ ప్రభుత్వమూ అంగీకరించదు. అందులో జగన్ అసలు ఒప్పుకోడు. జగన్ స్వతహాగా మొండోడు. సమ్మెకు వెళతామన్నా జగన్ సిద్ధంగా ఉన్నాడనే తెలుస్తోంది. వారు అడిగినంత ఫిట్ మెంట్ ఇస్తే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి వీలులేదు. ప్రజల్లో కూడా ఉద్యోగులపై అంత సాఫ్ట్ కార్నర్ లేకపోవడాన్ని జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకోనుంది. గతంలో ఎన్టీఆర్ కూడా ప్రభుత్వోద్యోగులను లెక్క చేయలేదు. నెలన్నర సమ్మె చేసిన తర్వాత వారంతట వారే దిగి వచ్చేలా చేశారు.
తమకు తాము ఎక్కువగా....
పొరుగు ఉన్న జయలలిత అయితే ఏకంగా ప్రభుత్వోద్యోగులను ఉద్యోగాల నుంచి పీకి పారేసింది. దీంతో వారు కాళ్ల బేరానికి వచ్చారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆర్టీసీ కార్మికుల విషయంలో అదే పంథాను అనుసరించారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేయబోతున్నాడని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఫిట్ మెంట్ తీసుకుని విధులు చేస్తే సరి, లేకుంటే సమ్మెకు వెళ్లినా పరవాలేదన్న యోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. సమ్మె చేస్తే అది ఉద్యోగులకే నష్టమని, ప్రజలు తన వైపు ఉంటారని జగన్ లెక్క. జగన్ చంద్రబాబు తరహా సీఎం మాత్రం కాదు. చంద్రబాబును బెదిరించినట్లు బెదిరించాలంటే కుదరదు. అందుకే ఉద్యోగులు తమను తాము ఎక్కువగా ఊహించుకోకుండా ఇచ్చింది తీసుకుని విధులు నిర్వహించుకుంటే మంచిది. లేకుంటే అసలుకే ఎసరు వస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. క్రిస్మస్ తర్వాత కొత్త ఏడాది దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.