హైకోర్టు ప్రయత్నం…ప్రత్యేక న్యాయస్థానం

దిశ ఘటన యావత్ భారతదేశాన్నే కదిలించింది. ఘటనపై సోషల్ మీడియా వేదికగా మారితే.. ఏకంగా రాష్ట్రాలే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో దిశ [more]

;

Update: 2019-12-19 11:53 GMT

దిశ ఘటన యావత్ భారతదేశాన్నే కదిలించింది. ఘటనపై సోషల్ మీడియా వేదికగా మారితే.. ఏకంగా రాష్ట్రాలే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో దిశ చట్టాన్నే అక్కడి ముఖ్యమంత్రి తీసుకు వస్తే తెలంగాణ ఉన్నత న్యాయస్థానం అత్యాచారాలపై ప్రత్యేక న్యాయస్థానాలనే ఏర్పాటు చేసింది. ఈ న్యాయస్థానాలు ఎలా పని చేస్తాయి> కేసుల పరిష్కారం ఎలా జరుగుతుంది?

ఏపీలో దిశ యాక్ట్ తర్వాత…..

అప్పుడు నిర్భయ ఘటన.. నేడు దిశ కేసు యావత్ భారతదేశాన్నే కదలించివేశాయి. ఆనాడు జరిగిన ఘటన, ఈరోజు చోటు చేసుకున్న దుశ్చర్య యావత్ ప్రజలనే కాదు ప్రభుత్వాలను సైతం కదలించివేసింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేగింది. మీడియాలు సైతం ఈ రెండు ఘటనలలో బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అందుకే నాడు నిర్భయ యాక్ట్ ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు దిశ యాక్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.ఘటన జరిగిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సాక్షాత్తూ అసెంబ్లీలోనే దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. పవర్ ఫుల్ చట్టాలతో నేరస్తులకు, నేరాలు చేయాలన్న ఆలోచన చేసే వారి గుండె గుబేల్ మనేలా శిక్షలు తీసుకు వచ్చారు. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది. దిశ కేసు వ్యవహారంపై కీలక నిర్ణయాలు చేపట్టింది.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా….

ఇటీవల జరిగిన వరంగల్ ఘటనలో చిన్నారిని బలికొన్న సైకో కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడునెలల వ్యవధిలో ఉరిశిక్షను అమలు చేసింది. పై కోర్టు దాన్ని జీవితఖైదుగా మార్చివేసింది. ఆ తరువాత దిశ కేసులో సైతం ఉన్నత న్యాయస్థానం మహబూబ్ నగర్ కోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది. అదిలాబాద్ సమత కేసులో సైతం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. నిజానికి మన రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పరిశీలిస్తే కోకకొల్లలుగా ఉన్నాయి. సగటున రోజుకు మూడు నుండి నాలుగు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ చాలా సంవత్సరాలుగా కోర్టు కేసుల్లోనే పెండింగ్ లో ఉన్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు జనాల్లో వచ్చే ఆగ్రహ జ్వాలల నేపధ్యంలో పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతోంది.

ప్రత్యేక కోర్టులతో…..

వాస్తవానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం లీగల్ సెల్ అథారిటీకి ఓ లేఖ అందిస్తుంది. అక్కడి నుండి హైకోర్టుకి చేరిన తరువాత దీనిపై ప్రత్యేక విచారణ కోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో ఆయా కేసుకు సంబంధించి విచారణ చేసే అధికారులు ఘటనకు సంబంధించిన ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు కోర్టులో ప్రవేశపెడితే తక్షణమే శిక్షలు విధించే అవకాశాలుంటాయి. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు అత్యాచారాలపై ఆరా తీసింది. కేసులు వాటి పెండింగ్ అంశాలపై సర్వే చేసిన ఉన్నతన్యా యస్థానం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఘటన జరిగినప్పుడే కాకుండా నిరంతరం అత్యాచారాలపై ఎప్పటికప్పుడు వేగవంతంగా విచారణ జరిగేలా పని చేసే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సై అందింది. 11 మందిని ప్రత్యేక విచారణ అధికారులుగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తక్షణ విచారణ కోసం…

ఆయా కోర్టుల్లో ఇక కేవలం అత్యాచార ఘటనలు మాత్రమే విచారణ జరిగేలా, కేసుల పరిష్కారం తక్షణం శిక్షలు పడేలా ఈ కోర్టులు పని చేయనున్నాయి. సంవత్సరానికి 365 రోజులు ఈ కోర్టులు పని చేస్తూనే ఉంటాయి. ఇక కిందకోర్టు, పై కోర్టుకి నిందితులు వెళ్లే అవకాశాలు లేకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణలు, శిక్షలు పడేలా ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాలపై మహిళ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News