ఫ్రెంచ్ డాక్యుమెంటరీలో హైదరాబాద్ జర్నలిస్ట్ ఉడుముల

హైదరాబాద్‌ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్‌రెడ్డి అరుదైన ఘనతను సాధించారు. ఫ్రెంచ్ డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్‌ చేశారు

Update: 2023-03-31 09:38 GMT

హైదరాబాద్‌ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్‌రెడ్డి అరుదైన ఘనతను సాధించారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఉడుముల ఫ్రెంచ్ భాషలో విడుదల కానున్న డాక్యుమెంటరీలో లీడ్ క్యారెక్టర్‌ చేశారు. ఇన్విస్టిగేషన్ జర్నలిజంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన సుధాకర్‌రెడ్డి ఈ ఘనత సాధించడం వెనక ఎంతో కృషి ఉంది. అసలైన, సిసలైన జర్నలిస్ట్‌కు అసలైన కిక్కు కొన్ని సంఘటనలు ద్వారా మాత్రమే లభిస్తుంది. పరిశోధనాత్మక వ్యాసాలు ఎన్నో ఆయన పత్రికల్లో రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా ఎర్ర చందనం పేరిట ఉడుముల రాసిన పుస్తకం పెను సంచలనమే అయింది. ఆ పుస్తకాన్ని అప్పటి చీఫ్ జస్టిస్‌ గా ఉన్న ఎన్వీ రమణ ఆవిష్కరించడం ఒక ఎత్తైతే, ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూలంకషంగా పరిశోధనాత్మక పుస్తకం రచించడం మరొక ఎత్తు. ‘బ్లడ్‌ సాండర్స్‌ – ది గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌’ పేరుతో డిసెంబర్ 14న ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.


మూడు దశాబ్దాలుగా...

దాదాపు మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో ఈ ప్రకృతి సంపదను కొందరు నేరగాళ్లు కొల్లగొడుతూనే ఉన్నారు. చిత్తూరులోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి చైనా, జపాన్‌ వంటి దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతోన్న ఈ ఎర్ర బంగారం అక్రమ రవాణా వెనక ఎంతో మంది రాజకీయనాయకులు, నేరస్థుల, బ్యూరోక్రాట్‌ల హస్తం ఉందనడం కాదనలేని వాస్తవం. కొందరు నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులు దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించినా ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.

క్రూరమైన నెట్‌వర్క్‌ను...
శేషాచలం నుంచి చైనా వరకూ సాగుతోన్న ఈ అక్రమ దందా వెనక ఒక పెద్ద నెట్‌వర్క్‌‌ను సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ పుస్తకరూపంలో బయటపెట్టారు. ఎందరో పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు, మాజీ ఐపీఎస్ అధికారుల అభిప్రాయాలతో ఈ పుస్తకాన్ని సమగ్రంగా మలిచారు ఎర్రచందనం చెట్లను అడ్డంగా నరికి ఎలా రవాణా చేస్తుందీ ఈ పుస్తకంలో పూసగుచ్చినట్లు వివరించారు. క్రూరమైన నెట్‌వర్క్ లొలసుగులను, ఆనుపానులను బయటపెట్టి శభాష్ అనిపించుకున్నారు. అలాగే ప్రస్తుతం రూపొందించిన డాక్యుమెంటరీలోనూ రూపొందించినట్లు ఉడుముల సుధాకర్‌ రెడ్డి "తెలుగు పోస్టు"కు చెప్పారు. క్రైమ్ రిపోర్టర్‌గా తన జీవితంలో ఎన్నో ఘటనలను వెలికితీసిన సుధాకర్ రెడ్డి ఈ డాక్యుమెంటరీతో మరింత ఎదగాలని ఆశిద్దాం.

ఫ్రెంచ్ డాక్యుమెంటరీలో...
ప్లానెట్ కిల్లర్స్ పేరిట వెబ్ సిరీస్ పేరిట ఫ్రెంచ్ టీవీలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. వైట్ విడో అనే ఎపిసోడ్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. హుగో వాన్ ఆఫెల్, మార్టిన్‌లు దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ సంచలనమే రేపింది. అయితే మరొక సంచలనం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్లానెట్ కిల్లర్స్ సిరీస్‌లో భాగంగా ప్రపంచంలో ప్రకృతిని నాశనం చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పై ఈ డాక్యుమెంటరీలు రూపుదిద్దుకున్నాయి. ప్రధానంగా పర్యావరణాన్ని కాపాడటం కోసం ఈ వెబ్ సిరీస్‌ను ప్రాణాలకు తెగించి మరీ రూపొందించారు. అడవులను నరికివేయడం, ఏనుగులను చంపి దంతాలను దొంగిలించడం, ఎర్రచందనం వంటి వాటిపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీలను రూపొందించారు. అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేసే గ్యాంగ్‌‌స్టర్ కార్బన్ పై కూడా డాక్యుమెంటరీ చేశారు.
ఎర్ర చందనం అక్రమ రవాణాపై...
అయితే ఎర్రచందనం మీద రూపొందించిన మరో డాక్యుమెంటరీ పెను సంచలనమే కాబోతుంది. ఏప్రిల్ 3వ తేదీన డాక్యుమెంటరీ ఫ్రెంచ్ టీవీలో విడుదల కానుంది. ఈ డాక్యుమెంటరీలో సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్‌ రెడ్డి లీడ్ క్యారెక్టర్ చేశారు. ఇది ఖచ్చితంగా తెలుగు జర్నలిస్టులకు దొరికిన అరుదైన అవకాశం. ఎవరికీ దక్కని.. కొందరికే లభించే అదృష్టం ఉడుములకు లభించింది. అదృష్టం అనేకంటే శ్రమ, కసరత్తు, లోతైన అథ్యయనం, విశ్లేషణ వంటి వాటితోనే ఉడుముల సుధాకర్ రెడ్డి ఈ ఘనత సాధించారని చెప్పక తప్పదు. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహుల్ హమీద్‌పై ప్రత్యేకంగా కథనాన్ని రూపొందించారు. సాహుల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉండి ఏపీలోని ఎర్రచందనాన్ని కాజేస్తున్నాడు. సాహుల్ ముఠాపై సంక్లిష్టమైన, సమగ్రమైన కథనాన్ని రూపొందించారు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్...
ఈ డాక్యుమెంటరీ షూటింగ్ చేసేందుకు హైదరాబాద్, తిరుపతి, శేషాచలం అడవులు, చెన్నై, తమిళనాడులోని జావాదు మలై, సింగపూర్, దుబాయ్‌లో షూటింగ్ చేశారు. రిటైర్డ్ అటవీ శాఖ అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్స్, డిఆర్ఐ అధికారులు, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఇంటర్వ్యూలతో సహా ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. చెన్నైలో సాహుల్ హమీద పుట్టిన ప్రాంతంలోనూ షూటింగ్ జరిపారు. సాహుల్ హమీద్ ఎలా ఎర్రచందనాన్ని దొంగిలిస్తాడు? ఆ ముఠా ఎంత వరకూ విస్తరించి ఉంది? ముఠా మూడో తేదీన విడుదలయ్యే ఈ ఎపిసోడ్ మరో సంచలనం కాబోతుంది. ఫ్రాన్స్ కుచెందిన ఈ డైరెక్టర్లు సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి సహకారంతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
ప్లానెట్ కిల్లర్స్ అంటే....
ప్లానెట్ కిల్లర్స్ అంటే పర్యావరణాన్ని నాశనం చేసే నేరగాళ్లపై పరిశోధించి వారు నేరాలకు ఎలా పాల్పడుతున్నారు? ఎలా చేస్తారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకు తిరుగుతారు? వారిని పట్టుకునేందుకు అధికారులు వెతికే మార్గాలతో పాటు పడే శ్రమ వంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో సమగ్రంగా వివరించారు. వారివల్ల పర్యావరణం ఎంత? ఎలా నాశనమవుతుందో కళ్లకు కట్టినట్లు చూపుతారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం మాత్రమే కాకుండా అరుదైన జంతువులను, అటవీ సంపదను ఎలా నరికి వేస్తారన్నది కూడా సమగ్రమంగా వివరిస్తారు. వన్యప్రాణుల అక్రమ రవాణా వంటి వాటిని అరికట్టేందుకు ఈ డాక్యుమెంటరీ ఉపయుక్తంగా ఉంటుంది. పేరు మోసిన నేరగాళ్లంతా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.

ఏప్రిల్ 3న విడుదల...
మనీలాండరింగ్, అవినీతి, ఆర్థిక మోసం, హింస మరియు హత్యలువంటి వాటిపై సమగ్ర పరిశోధనలు జరిపి డాక్యుమెంటరీలను రూపొందించారు. పర్యావరణాన్ని కొల్లగొడుతూ సంవత్సరానికి 300 బిలియన్ యూరోలు కొల్లగొడుతున్నారు. పరిశ్రమ కాలుష్యానికి పాల్పడిన రారీలో ఉన్న ఫ్రెంచ్ వ్యక్తి, ఏనుగులను వేటాడే కెన్యా వ్యక్తి, అటవీ సంపదను నాశనం చేసే భారతీయుడు ఇలా ప్రతి ఒక్కరి కథనం డాక్యుమెంటరీ ద్వారా అందిస్తారు, అంతరించిపోతున్న జంతువులను అక్రమంగా రవాణా చేసినందుకు ఒక చైనాకు చెందిన నేరగాడిపై కూడా పరిశోధన జరిగింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ అయిన నలుగురు క్రిమినల్స్ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఏప్రిల్ 3వ తేదీన ఈ డాక్యుమెంటరీ విడుదల కానుంది. ఈ డాక్యుమెంటరీ ప్రజాదరణ పొంది నేరగాళ్లకు చెక్ పడేలా ఉండాలని ఆశిద్దాం.


Tags:    

Similar News