IAS Trasfers : ఎందుకీ దోబూచులాట...ఐఏఎస్‌లకు ఎందుకీ పీకులాట?
ఐఏఎస్‌లు అంటే ప్రజా సేవ చేయడానికి నియమితులయిన వారు. వారికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది.
ఐఏఎస్‌లు అంటే ప్రజా సేవ చేయడానికి నియమితులయిన వారు. వారికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సివిల్స్ చదవి ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన వారందరికీ వారికి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. వారు ఏ పోస్టింగ్ ఇచ్చినా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు సేవను మరింతగా చేయడానికి వారు కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఐపీఎస్ లు కూడా శాంతి భద్రతల పరిరక్షణ కోసం నియమితులవుతారు. నిష్పక్షపాతంగా జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుంది. శిక్షణలోనూ అదే చెబుతారు. కానీ మన ఐఏఎస్ లు మాత్రం కొన్ని ప్రాంతాలకు అలవాటు పడిపోయి అక్కడి నుంచి కదలమని భీష్మించుకుని కూర్చుండటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
హైకోర్టులోనూ దక్కని ఊరట...
ఐఏఎస్ ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, సృజన, శివశంకర్, హరికిరణ్ లు నిన్న క్యాట్ ను ఆశ్రయించారు. అయితే క్యాట్ లో నిన్న వాదనలు విని వీరిని వెంటనే ఎక్కడికి కేటాయించిన వారు అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే ఈరోజు వారంతా తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు మాత్రం నిర్దద్వంగా వారి పిటీషన్ ను కొట్టివేసింది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ లో వినిపించిన వాదనలే హైకోర్టులో వినిపించేందుకు ఐఏఎస్‌ల తరుపున న్యాయవాదులు వినిపించబోయినా హైకోర్టు వినిపించలేదు. ఈ సందర్భంగా హైకోర్టు కొంత కటువైన వ్యాఖ్యలు చేశారు.
15 రోజులు సమయం...
తమకు పదిహేను రోజులు సమయం ఇవ్వాలని, స్టే ఇవ్వాలని వారు కోరారు. కానీ హైకోర్టు మాత్రం స్టేలు ఇస్తూ పోతే ఈ అంశం ఎప్పటికీ తేలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని తెలిపింది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహార శైలి ఉండకూడదని కూడా అభిప్రాయపడింది. ఎవరు ఎక్కడ పనిచేయాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎక్కడైనా ఉద్యోగమే. అదే వేతనం. అదే డీఏ, అలవెన్సులు.. ఇక వీరు ఎక్కడ పనిచేస్తే తప్పేముంది అన్నది కూడా సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఉద్యోగాలు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు కాలహరణం చేస్తున్నారన్న ప్రశ్న ఎదురవుతుంది.
ఏపీకి వెళ్లడం ఇష్టం లేదా?
హైకోర్టు తీర్పు వీరంతా ఇప్పుడు ఎవరి రాష్ట్రాల్లో వారు రిపోర్టు చేయాల్సిన పరిస్థితి ఈరోజే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన రిపోర్టు చేయమంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లడం ఇష్టం లేక కొందరు ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలయితే ఉన్నాయి. అయితే ఏపీ కూడా ఒక రాష్ట్రమేకదా? అక్కడ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లేదా? అన్నది కూడా ఐఏఎస్ లు ఆలోచన చేయడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇది కొత్తేమీ కాదు. గతంలో అయితే ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లేవారు. కానీ ఇప్పుడు మాత్రం తమకు అనువైన ప్రాంతంలోనే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ కల్చర్,వాతావరణానికి అలవాటు పడిపోయిన వారంతా ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఇమడలేమని కొందరు ఈ విధమైన చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఐఏఎస్ ల ఈ బదిలీ పోరాటం మాత్రం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.