బంధువులూ... బీ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన వైసీపీ, టీడీపీ అధినేతలు తమ బంధువులను మాత్రం దూరం పెడుతున్నారు.

Update: 2023-04-28 04:15 GMT

అదేమి చిత్రమో కాని.. రాజకీయ పార్టీలు అధికారంలో లేనప్పుడు మాత్రం బంధువుల అవసరం ఉంటుంది. పవర్‌లోకి వస్తే చుట్టాలను దూరంపెడతారు. తెలంగాణ రాజకీయాలను పక్కన పెడితే ఏపీలో మాత్రం బంధువులొస్తున్నారు జాగ్రత్త అన్నట్లు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు వ్యవహరిస్తున్నారు. అందుకు చంద్రబాబు, వైఎస్ జగన్‌లు మినహాయింపు కాదు. అధికారంలో లేనప్పుడు వారి అవసరం గుర్తొస్తుంది. బంధువులొస్తే ఎక్కడ పార్టీలో కీలకంగా మారతారని భావన కావచ్చు. తమ ముఖ్యమైన కుటుంబీకులుకు భవిష్యత్‌లో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించవచ్చు. ముందు చూపుతో బంధువులను అధికారంలోకి రాగానే దూరం పెడతారు.

కేసీఆర్ ఒక్కడే...
తెలంగాణలో చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తన చుట్టాలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు. వారికి పదవులను ఇచ్చేందుకు కూడా వెనకాడరు. హరీశ్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడం అలాంటిదే. ఎలాంటి భయం లేనప్పుడు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం పార్టీ అధినేతలకు ఉంటుందని చెప్పడానికి కేసీఆర్ ఉదాహరణ. తన అల్లుడు సంతోష్‌ను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఇది అనైతికమని అందరూ అనుకోవచ్చు. కానీ తనకు నమ్మకం ఉన్న వారు రాజకీయంగా తనకు చేదోడు వాదోడుగా నిలబడతారని ఎందుకు అనుకోకూడదు? బంధువులే రాబందులే మారుతున్న ఈ రోజుల్లో కూడా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మాత్రం ఒక ప్రత్యేకం అని చెప్పుకోవాలి.
చంద్రబాబు అంతే...
ఇక చంద్రబాబుకు నిజానికి జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. జూనియర్‌ను తనకు అనుకూలంగా ప్రచారానికి వాడుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పదవులను ఆశించరు. ఎందుకంటే ఆయన సినిమా కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీలో చోటు అంటేనే బాబు కళ్లల్లో భయం కనిపిస్తుంది. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని కోరుతుండటం ఇటీవల కాలంలో సహజంగా మారినా చంద్రబాబు మాత్రం అలా ఆలోచించరు. భవిష్యత్‌లో లోకేష్‌కు ఇబ్బంది కాకూడదన్నదే ఆయన ఈ నిర్ణయం. బాలకృష్ణతో ఎలాంటి భయం లేదు కనుక ఆయనను ఎమ్మెల్యేను చేశారు. హరికృష్ణ కుటుంబాన్ని తాను దూరం చేయలేదని చెప్పడానికి మాత్రం ఆయన కుమార్తె సుహాసినికి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్టీఆర్ కుమారులు ఎవరూ రాజకీయంగా ఇబ్బంది పెట్టరని భావించి వారిని మాత్రం దగ్గరకు తీస్తారు కాని ఎలాంటి పదవులు మాత్రం ఇవ్వరు. చంద్రబాబు ఎవరినీ అంత సాధారణంగా నమ్మరు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయరు. దగ్గర బంధువులకంటే చంద్రబాబుకు తొండెపు దశరథ జనార్థన్ వంటి వారికే ప్రాధాన్యత ఇస్తారంటే అతిశయోక్తి కాదేమో. రక్తసంబంధాన్ని కూడా పక్కన పెట్టడం బాబుకు అలవాటు.
జగన్ ఇంతే...
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అంతేనని చెప్పుకోవాలి. అధికారంలో లేనప్పుడు అమ్మ, చెల్లి అవసరం ఆయనకు కావాల్సి వచ్చింది. జగన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం జైలులో పెట్టినప్పుడు వైఎస్ షర్మిల రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. ఇక 2019 ఎన్నికల్లో షర్మిల, విజయమ్మలే జగన్ కోసం ప్రచారం చేశారు. వారి వల్ల జగన్‌కు అధికారం దక్కిందని చెప్పలేం కాని, విజయం సాధించడంలో వారి పాత్రను మాత్రం మరువలేం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ షర్మిలకు కనీసం ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు. అదే కనుక ఇచ్చి ఉంటే ఆమె తెలంగాణలో ఇప్పుుడు రాజకీయంగా ఇన్ని కష్టాలు పడేవారు కారు. వైఎస్ విజయమ్మను కూడా గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించి జగన్ ముందు చూపుతో వ్యవహరించారంటారు. వారిద్దరికంటే సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్యులయ్యారు జగన్‌కు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద ఏపీలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల వైఖరి వేరుగా కనిపిస్తుంది. చంద్రబాబు, జగన్‌లు ముఖ్యమైన బంధువులను మాత్రం దూరం పెడుతూ ఓటమిని అయినా అంగీకరిస్తారు కానీ, వారికి పదవులు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోరు.


Tags:    

Similar News