జగన్ దిగి వచ్చారా?

నిన్నటి వరకూ సమీక్షల్లో ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన జగన్ నిన్నటి సమావేశంలో కూల్‌ గా ఉండటం మార్పునకు నిదర్శనమంటున్నారు;

Update: 2023-04-04 06:04 GMT

ఎప్పుడు తగ్గడమే కాదు.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లే అసలు సిసలైన రాజకీయ నేత. ఇది పాత డైలాగైనా ఎప్పటికీ పాలిటిక్స్‌లో నానుతూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు సహజంగా నియంతృత్వానికి చిరునామాలు. జాతీయ పార్టీలలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రాంతీయ పార్టీల్లో కనిపించదు. అధినేత చెప్పిందే వేదం. ఆయన తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అది తెలుగుదేశం పార్టీ అయినా.. వైసీపీ అయినా.. చంద్రబాబు అయినా.. జగన్ అయినా.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు తమ వల్లే గెలిచారనుకుని ఎవరినీ లెక్క చేయరు. అదే కొన్ని సార్లు రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. చంద్రబాబు కూడా పవర్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కేర్ కూడా చేయలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలతోనే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. నేతలను లైన్‌లోకి తీసుకురావడానికి పెద్ద కసరత్తులే చేయాల్సి వచ్చింది.

ముక్తసరి పలకరింపులు...
జగన్ కూడా అంతే. గత నాలుగేళ్ల నుంచి ఆయన మోనార్క్. ఎవరినీ కలవడు. ఎవరితో మాట్లాడడు. సమావేశాల్లో కలిసినా ముక్తసరి పలకరింపు మినహా ఎమ్మెల్యేలతో మనసు విప్పి మాట్లాడింది లేదు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా పొలిట్ బ్యూరో అంటూ ఏమీ లేదు. జగన్ నిర్ణయమే ఫైనల్. అది ఎమ్మెల్సీ ఎంపిక అయినా, ప్రభుత్వంలో కీలక నిర్ణయమైనా తాను తీసుకోవల్సిందే. చంద్రబాబు తరహాలోనే అధికారుల మీద ఆధారపడి రాజకీయంగా జగన్ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేబినెట్ సమావేశాలు మినహాయించి మంత్రులను కలిసిందీ లేదు. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే చూసుకుంటారు. ఆయనను తప్ప మరెవర్నినీ కలిసే వీలు లేదు. అంతా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడతాయి. వారు శాసిస్తారు.. వీరు పాటించాలి అన్న రీతిలో సాగిస్తున్నారు.
సీనియర్ నేతలను కూడా...
సీనియర్ నేతలు ఎందరో పార్టీలో ఉన్నారు. వారి సలహాలు, సంప్రదింపులకు కూడా జగన్ కు సమయం ఉండదు. వారి రాజకీయ అనుభవాన్ని అయినా పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో గెలుపునకు ఉపయోగించుకోవాలన్న స్పృహ లేదు. అంతా తానే. తాను తీసుకున్న నిర్ణయం తప్పు కాదన్న నమ్మకం. విశ్వాసం. అంతే తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని పదే పదే అంటున్న జగన్ పార్టీకి బలమైన క్యాడర్‌లో నిరాశ నెలకొందన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యేలా రిజల్ట్ రావడంతో అసలు విషయం తెలిసొచ్చింది. తన ఒక్కడి వల్లే పార్టీని గెలుపు తీరాలకు చేర్చలేనని, అందుకు అందరి సహకారం అవసరమని గుర్తించినట్లుంది. తలా ఒకచేయి వేస్తే తప్ప గెలుపు సాధ్యం కాదని కూడా తెలుసుకున్నట్లుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలతో...
అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కూడా ఊహించనిదే. నాలుగేళ్ల తన ముఖ్యమంత్రి కెరీర్‌లో ఊహించని రీతిలో ఎమ్మెల్యేలు జగన్‌కు ఝలక్ ఇచ్చారు. ఫలితంగా ఒక ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. దీంతో జగన్ కొంత నేల మీదకు దిగి వచ్చినట్లే కనపడుతుంది. నిన్న మొన్నటి వరకూ సమీక్షల్లో ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన జగన్ నిన్న జరిగిన సమావేశంలో కూల్‌ గా ఉండటం మార్పునకు నిదర్శనమంటున్నారు. ఎమ్మెల్యేలందరినీ తిరిగి గెలిపించుకుంటానని చెప్పారు. అందరికీ అవకాశముంటుందని ఎమ్మెల్యేలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలోచన ముందే ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు దూరం కాకపోయేవారని, ఆ ఒక్క ఎమ్మెల్సీని కూడా తామే దక్కించుకునే వారమని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా తమ అధినేత నేలమీదకొచ్చినందుకు వైసీపీ నేతలు సంతోష పడుతున్నారు.


Tags:    

Similar News