శాసనసభ రద్దు కావడంతో తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తమయింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ముందస్తు ఎన్నికలపై అధిష్గానం పెద్దలతో మాట్లాడి వచ్చారు. మరోసారి ఈనెల 12వ తేదీన హస్తినకు రావాలని ఉత్తమ్ ను అధిష్టానం ఆదేశించింది. అయితే ఈలోపు కార్యాచరణను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో సమావేశం కాబోతున్నారు. పీసీసీ కార్యవర్గ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచన చేయనున్నారు. అభ్యర్థుల ప్రకటన, రాహుల్, సోనియాగాంధీ పర్యటనలపై చర్చించనున్నట్లు సమాచారం.
ఫీడ్ బ్యాక్ ప్రకారమే......
నియోజకవర్గాల ఇన్ ఛార్జి లనుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, ఏఐసీసీ కార్యదర్శులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ మానససరోవర్ యాత్రలో ఉన్నారు. ఈనెల 12న ఆయన ఢిల్లీకి రానున్నారు. ఆయన వచ్చిన వెంటనే తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలన్న ఆలోచనలో టి.కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తులు అంశంకూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.