ఎన్నడూ ఊహించని వారంతా చిత్రంగా కలిశారు. పైకి కేసీఆర్ సర్కార్ ను ఓడించడమే వారందరి కలయికకు ఏకైక సిద్ధాంతం. కాగా తామంతా అధికారం సాధించడం ఇంకో లక్ష్యం. దీనికోసం మహాకూటమి పేరుతో తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంపైకి వచ్చాయి కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు అయితే ఇక్కడి దాకా బానే వున్నా అసలు సంగతి పొత్తుల లెక్కలతో అన్ని పార్టీలు కిందా మీదా పడుతున్నాయి.
టెన్షన్ లో హస్తం పార్టీ.....
అన్ని పార్టీలకన్నా టెన్షన్ తో కిందా మీదా పడుతుంది మాత్రం కాంగ్రెస్. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్న నేతలు, తమ టికెట్ పొత్తులో పోతే ఎలా సహిస్తారు ? అస్సలు సమస్య లేదని ఉద్యమాలకు సిద్ధం అయిపోయారు. వీటికి తోడు హస్తం పార్టీకి ఆశావహుల తాకిడి ఎక్కువ కావడంతో బాటు పొత్తులో సీట్లు గల్లంతును కాంగ్రెస్ నాయకులు తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో గాంధీభవన్ దగ్గర ఎప్పుడేమి జరుగుతుందో ఊహించడం కష్టంగానే వుంది.
భద్రత కోసం చేయిచాచి ...
ఈనేపధ్యంలో ప్రయివేట్ సెక్యూరిటీ ఇప్పటికే పెట్టుకున్న హస్తం పార్టీకి ఆ బృందాలు ఏమాత్రం రక్షణ కల్పించలేవన్న నిర్ణయానికి వచ్చింది. మరింత భద్రతకు చర్యలు తీసుకోవాలని టి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్నప్తి చేసింది. ముఖ్యంగా రాబోయే ఎనిమిది రోజులు అంటే నామినేషన్లు, ఉపసంహరణలు, స్క్రూటినీ వరకు గాంధీ భవన్ కి నాయకులకు సెక్యూరిటీ అడుగుతుంది టి కాంగ్రెస్. తమ పార్టీ టికెట్లు కేటాయించకుండానే పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా ఉంటే ఇక ప్రకటించాక ఎలా ఉంటుందో అన్న ఆందోళన కాంగ్రెస్ నేతలల్లోను కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. అందుకే ముందస్తు రక్షణ అవసరమన్న లెక్కల్లో హస్తం సీనియర్లు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా కానీ పరిస్థితి అదుపులో ఉంటుందన్న నమ్మకం మాత్రం వారికి లేకపోవడం గమనార్హం.