జగనన్న అస్త్రం గురి తప్పుతుందా?
జగన్ కు వచ్చే ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. రెండోసారి గెలిస్తే ప్రధానమైన ప్రతిపక్ష టీడీపీని రాజకీయంగా మరింత దెబ్బతీయవచ్చు
జగన్ కు వచ్చే ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. రెండోసారి గెలిస్తే ప్రధానమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మరింత దెబ్బతీయవచ్చు. ఆ పార్టీ నేతలు, క్యాడర్ ను కూడా పక్కకు లాగేయవచ్చు. కానీ అది అంత సులువు కాదు. అందుకోసమే ప్రతి అంశంపైనా దృష్టిపెడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వేళావిశేషం బాగాలేదు. అధికారం చేపట్టిన తొలి రెండేళ్లు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ప్రధాన మైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజధాని అన్నది లేకుండానే చేస్తూ ఐదేళ్ల పాటు నెట్టుకొచ్చారన్న విమర్శలు ఎటూ ఉండనే ఉన్నాయి.
సంక్షేమం సక్రమంగానే...
సంక్షేమం సక్రమంగానే ఉన్నా అభివృద్ధి విషయంలో మాత్రం జగన్ వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పేలా లేదు. కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే అధికార పార్టీకి దూరమయ్యారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఉన్నతస్థాయి వర్గాలు, ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక కాపులు కూడా అంత అనుకూలంగా లేరు. బీసీ ఓట్లపైనే జగన్ నమ్మకం పెట్టుకున్నారు. వీరితో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు తనకు అండగా ఉంటారన్న విశ్వాసంతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందిని మార్చడానికి సిద్ధపడుతున్నారు. అన్ని రకాలుగా మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాలంటరీ వ్యవస్థకు తోడుగా...
తనకు వాలంటరీ వ్యవస్థ వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భావించిన జగన్ అది చాలదని భావించినట్లుంది. గెలుపు గుర్రం ఎక్కాలంటే ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. అందుకే గృహసారథుల వంటి కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. ఈ నెలాఖరులోపు గృహసారథుల నియామకం పూర్తికావాల్సి ఉంటుంది. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గృహసారధులను నియమించనున్నారు. వీరు తమకు కేటాయించిన గృహాలకు చెందిన ఓటర్లను మంచి చేసుకోవాలి. వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలను గుర్తించి ఈ ఏడాది కాలంలో వాటిని పూర్తి చేయాలి. పూర్తిగా పార్టీ పరంగా చేపడుతున్న నియామకం కావడంతో వారే చివరకు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు తమకు కేటాయించిన ఇళ్లవారిని తీసుకువచ్చి ఓట్లను వైసీపీకి అనుకూలంగా వేయాల్సి ఉంటుందన్న ఆలోచనతోనే ఈ కాన్సెప్ట్ ను తెచ్చారు.
రెండింటి మధ్య....
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.2 లక్షల మంది గృహసారధులను నియమించాలని ఆదేశించారు. వీరితో పాటు 45 వేల మంది కన్వీనర్లను కూడా నియమించనున్నారు. అయితే ఇప్పటికే ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు వీరు పోటీ అవుతారా? అన్న అనుమానమూ లేకపోలేదు. వాలంటీర్ కు, గృహసారధికి మధ్య సమన్వయం, సఖ్యత లేకుంటే అసలుకే ముప్పు ఏర్పడుతుంది. అందుకే వాలంటీర్లతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. కానీ అన్ని చోట్ల వాలంటీర్‌కు, గృహసారధికి మధ్య సయోధ్య కుదిరే అవకాశముండదు. ఒకరు ప్రభుత్వ పరంగా, మరొకరు పార్టీ పరంగా నియమితులు కావడంతో ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయి. వీటిని పరిష్కరించడం స్థానిక పార్టీ నేతలకు తలనొప్పిగా మారే అవకాశముందన్న కామెంట్స్ కూడా పార్టీ సీనియర్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరి జగన్ ఆలోచన మంచిదే.. కానీ ఆచరణలో .. ఇన్ని లక్షల మందితో.. అయ్యే పనేనా? అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తుండటం విశేషం.