అది నోరా... అబద్ధాల ఫ్యాక్టరీనా..?

Update: 2018-09-03 11:59 GMT

గుంటూరులో ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నించిన ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టి వేదించడంపై ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం విశాఖపట్నం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కె.కోటపాడులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ముస్లిం యువకులు స్వచ్చందంగా చంద్రబాబును నిలదీస్తే నెపం మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పై వేస్తున్నారని, గతంలో తునిలో కాపుల ఆందోళన సమయం జరిగిన ఘటనకు వైసీపీ కారణమని అబద్ధాలు ఆడారని ఆరోపించారు. పవిత్ర పుస్తకం వంటి ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా, 99 శాతం పూర్తి చేశానని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఆయనది నోరా..? అబద్ధాల ఫ్యాక్టరీనా..? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైతులు, డ్వాక్రా రుణాలు, ఉద్యోగాలు, పెట్టుబడులు, ఇసుక, పోలవరం వంటి అన్ని అంశాల్లోనూ అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు.

నోరా..? నారా..?

చంద్రబాబు అబద్ధాలను ఎల్లో మీడియా అదేపనిగా ప్రచారం చేస్తుందని విమర్శించారు. 2014కి ముందు జగన్ కి ఓటేస్తే రాష్ట్రాన్ని విభజించిన రాహుల్ గాంధీకి ఓటేసినట్లే అని చెప్పారని, ఇప్పుడు జగన్ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు బీజేపీతో ఉంటే బీజేపీ మంచిదని, కాంగ్రెస్ తో ఉంటే కాంగ్రెస్ మంచిదని అంటారని పేర్కొన్నారు. జీవితంలో ఒక్క అబద్ధం కూడా ఆడని వ్యక్తిని సత్య హరిశ్చంద్రుడు అంటామని, జీవితంలో ఒక్క నిజం కూడా మాట్లాడని వ్యక్తిని నారా చంద్రబాబు నాయడు అంటామని ఎద్దేవా చేశారు. ఇటువంటి అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తిని పొరపాటున కూడా క్షమించవద్దని జగన్ కోరారు.

Similar News