దార్శనికుడు వైఎస్.. జైరాం రమేష్
జలయజ్ఞం - పోలవరం ఒక సాహసి ప్రయాణం పుస్తకాన్ని కేవీపీ రామచంద్రరావు ఆవిష్కరించారు.
జలయజ్ఞం - పోలవరం ఒక సాహసి ప్రయాణం పుస్తకాన్ని పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కేవీపీ రూపొందించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో విడుదల చేశారు. పుస్తకాన్ని ఎమ్మెస్కో సంస్థ రూపొందించింది. ఈ పుస్తకావిష్కరణ సభలో మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్ ఉన్న నేత అని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్ హయాంలో చాలా వరకూ పనులు పూర్తి చేశారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించిందన్నారు. వైఎస్ సాగునీటి పారుదలకు మాత్రమే కాకుండా సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైఎస్ దార్శినికుడు అని వక్తలు కొనియాడారు. సంక్షేమం అంటేనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. సంక్షేమాన్ని ప్రజలకు అందించి విద్య, వైద్య రంగాల్లో పేదలకు అండగా నిలిచారని వక్తలు కొనియాడారు.
వైఎస్ లో ఆత్మవిశ్వాసం మెండు...
తాను సాధించగలనన్న నమ్మకంతో సంకల్పంతో పోలవరం ప్రాజెక్టును వైఎస్ తలకెత్తుకున్నాడని కేవీపీ రామచంద్రరావు అన్నారు. సత్సంకాల్పాన్ని ఎలా ఇప్పుడు నీరు గారుస్తున్నారో చూస్తున్నామన్నారు. బలమైన ఆశయంతో వైఎస్ పోలవరానికి బాటలు వేశారన్నారు. తన శక్తిమేరకు 2020 వరకూ తాను పోలవరం ప్రాజెక్టు కోసం రాజ్యసభలో పోరాడానని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని సాధించడం కోసమే ప్రయత్నించానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్ బారుతో పాటు వైఎస్ హయాంలో పనిచేసి పదవీ విరమణ చేసిన కొందరు అధకారులతో పాటు ఆయనతో సాన్నిహిత్యం ఉన్న కొందరు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్ హయాంలో మంత్రి వర్గంలో పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి, వసంత నాగేశ్వరరావు, గీతారెడ్డి వంటి వారు హాజరయ్యారు.