ఫైనల్ గా పవన్ రూట్ మ్యాప్ ఇదేనా?
పవన్ కల్యాణ్ కొత్త రాజకీయాలకు తెరతీసేటట్లే కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త రాజకీయాలకు తెరతీసేటట్లే కనిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లే కనపడుతుంది. బీజేపీతో ఆయన విడాకులివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలయితే కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఈరోజు తిరుపతిలో చేేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీతో పొత్తు పెట్టుకోనని చెప్పారు. అంతవరకూ ఒకే. కానీ దేశం, రాష్ట్ర స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలని ఆయన కోరుకున్నారు. అంటే దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారని అర్థమవుతుంది.
తృతీయ ప్రత్యామ్నాయం కావాలని...
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా తృతీయ ప్రత్యామ్నాయం కావాలని పవన్ కల్యాణ్ కోరుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి త్వరలోనే ఆయన విడాకులు ఇస్తారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీతో కాలు దువ్వుతున్న కేేసీఆర్ తో ఆయన చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. విధ్వంసక పాలన కొనసాగుతున్నప్పుడు అవసరమైతే ప్రత్యర్థులతో చేతులతో కలుపుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పుడుతున్నాయి. ఎవరు ప్రత్యర్థులు.. ఎవరిది విధ్వంసక పాలన అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రత్యర్థి ఎవరు?
ఏపీలో టీడీపీ ప్రత్యర్థి కాదు. వైసీపీ ప్రత్యర్థి అయినా పవన్ ఆ పార్టీతో చేతులు కలిపే అవకాశం లేదు. కాంగ్రెస్ తో చేతులు కలిపి లాభం లేదు. ఇక ప్రత్యర్థి ఎవరు అన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. అందుకే కేసీఆర్ తో పవన్ ప్రయాణం చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తుండటంతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పెద్దగా విభేదాలు లేవు. పైగా కేసీఆర్ తో ఏపీ ప్రజలకు కూడా పేచీ లేదు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ తోనేనా?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడం కూడా ఇందులో ఒక భాగమేనని అంటున్నారు. టీఆర్ఎస్ తో నేరుగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగే సాహసం చేయదలచుకున్నట్లే ఉంది. ఏపీలో టీడీపీతో కలవకపోయినా ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా పవన్ మానసికంగా సిద్ధమవుతున్నట్లే తెలిసింది. సీట్లు వచ్చినా రాకపోయినా తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆయన భావిస్తున్నారు. బీజేపీతో వార్ చేస్తున్న కేసీఆర్ అంటే పవన్ కు మొదటి నుంచి ఇష్టమే. ఆ ఇష్టమే ఇప్పుడు రాజకీయంగా సఖ్యతను నెలకొల్పాలని జనసేనాని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి కొంతకాలంగా పవన్ కల్యాణ్ దూరంగా ఉంటుననారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయాలపై ఒక స్పష్టత త్వరలోనే ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి.