పవన్ ఈ ప్రశ్నకు బదులేది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్నా ఇంత వరకూ రెడీ కాలేదు.
తెలంగాణలోనూ తాము పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించి నెలలు గడుస్తుంది. కనీసం 25 స్థానాలకు తగ్గకుండా పోటీ చేస్తామని ఆయన చెప్పారు కూడా. అయితే ఇంత వరకూ తెలంగాణలో ఆయన చేసిన ప్రయత్నాలు మాత్రం ఏవీ లేవనే చెప్పాలి. అయితే ఇక్కడ కొందరు నేతలు పోటీ చేయడానికి ఉత్సాహ పడుతుండటంతో ఆ మాట అన్నారా? లేదా నిజంగానే తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతారా? అన్నది చూడాలి. ఇంత వరకూ తెలంగాణలో పర్యటన చేసింది లేదు. ఒక్క వారాహి వాహనాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్దకు తీసుకెళ్లి పూజలు జరిపి చేసిన హడావిడి తప్పించి మరో ప్రయత్నం చేయలేదు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును...
అయితే ఏపీలో ఒక తరహా తెలంగాణలో మరో తరహా విధానాన్ని అవలంబించాల్సి వస్తుందని ఆగారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. తనను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ కలుపుకుని వెళ్లలేదని, తెలంగాణలో ఆంధ్రోళ్లను కలుపుకుంటే తమకు సీట్లు రావని బీజేపీ నేతలు అనడాన్ని కూడా ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో ఆయన తెలిపారు. బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా పవన్ ను కలుపుకునేందుకు ప్రయత్నం చేయడం లేదు. అసలు తెలంగాణ నేతలకు తమ పొత్తుతో ఉన్న పవన్ కల్యాణ్ గుర్తు ఉన్నాడా? అన్న అనుమానం కూడా కలగక మానదు. అప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం బండి సంజయ్ వెళ్లి కలసి రావడం మినహా మరోసారి కలిసింది కూడా లేదు.
తెలంగాణలో పోటీకి...
అంటే తెలంగాణలోనూ టీడీపీతో పొత్తు అయినా పెట్టుకోవాలి.. లేకుంటే ఒంటరిగానైనా పోటీ చేయాలి. ఎలా చేసినా ఆయన ఒక విమర్శకు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ఆంధ్రప్రదేశ్‌లో అందరినీ కలుపుకునే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా అక్కడ చాలా సమయం ఉండటంతో ఇప్పడే పొత్తుల గురించి చర్చించ బోమని కూడా చెప్పారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చే సరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేలా ఒంటరిగా పోటీ చేస్తారా? లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎలా పోటీ చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికేనన్న విమర్శలను ఎదుర్కొనక తప్పదు.
కేసీఆర్ పై విమర్శలు...
పాతిక సీట్లలో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. తొలి నుంచి తెలంగాణలో అధికార పార్టీపై పవన్ కల్యాణ్ ఎన్నడూ విమర్శలు చేయలేదు. చేయకపోగా పలుమార్లు కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చేందుకు ప్రయత్నిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చీల్చడానికేనని చెప్పక తప్పదు. అంటే తెలంగాణ, ఏపీ రాజకీయాలు వేరు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా లేవు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కలిసే పరిస్థితి ఎంత మాత్రం లేదని చెప్పి తప్పించుకుంటారా? లేక కనీసం పోటీ చేసి అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తే కొంత వరకూ నయమనిపిస్తారు. లేదంటే రెండు రాష్ట్రాల్లో రెండు పోకడలు అవలంబిస్తారా? అన్నది చూడాల్సి ఉంది.