మాడి మసై పోతావేమో తమ్ముడూ
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సమావేశమయ్యారు
రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీపం లాంటి వారు. ఆ దీపాన్ని ఆకర్షించి అనేక పురుగులు చేరినట్లుగానే పార్టీలు కాని చేరతాయి. కానీ చివరకు ఆ పార్టీలు భస్మం కావాల్సిందే. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ సోషల్ మీడియాలో అదే రకమైన చర్చ జరుగుతుంది. సినిమా మొదట్లో అంతా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి అసలు సీన్ ప్రారంభమవుతుంది. చంద్రబాబు విషయంలోనూ అంతేనంటారు. టీడీపీ, జనసేన కలసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కాని జనసేనానికి రెండో ఏడాది కాని అసలు సీన్ అర్థం కాదు.
అధికారంలో ఉన్నప్పుడు...
చంద్రబాబు నలభై పదుల రాజకీయ అనుభవం ఉన్నవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మారినట్లు ఎవరూ మారరు. అది ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుసు. ఎందుకంటే పవర్ లో ఉంటే చంద్రబాబు పాలిటిక్స్ వేరుగా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉంటాయి. రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినా పవన్ మాట చంద్రబాబు వింటారని గ్యారంటీ లేదు. అవసరమైతే జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకోగల సత్తా చంద్రబాబుకు ఉంది. ఆ విషయంలో చంద్రబాబు ఎలాంటి శషబిషలకు పోరు. తాను ఐదేళ్లు ప్రశాంతంగా పాలన చేయాలనుకుంటారు. తప్ప కాళ్లకు అడ్డం పడిన వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేసి వెళ్లడం చంద్రబాబు నైజంగా చెప్పుకోవచ్చు.
ఎమ్మెల్యేలు ఉంటారని...
పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని పదో పరకో సీట్లు గెలిచినా ఐదేళ్ల వరకూ వారంతా ఆయన వెంట ఉంటారని నమ్మకం లేదు. జనసేన నేతలు కమ్యునిస్టులు కాదు. బీజేపీ నేతలు అసలే కాదు. ఆ పార్టీలయితే సిద్ధాంతాలను నమ్ముకుని పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారు. కానీ జనసేన ఫక్తు రాజకీయ పార్టీ. ఆ పార్టీ నుంచి గెలిచిన నేతలకు సిద్ధాంతాలుండవు. వారికి పదవులు కావాలి. పెత్తనం చేయాలి. అంతే ఉంటుంది. ఐదేళ్ల తర్వాత.. రాజెవరో.. అనుకునే రకం. అందుకే పవన్ కల్యాణ్ ఊరికే చంద్రబాబుతో ముచ్చట్లు సాగిస్తే ఫలితం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడమని జనసేన అభిమానులు, సీనియర్ నేత హరిరామ జోగయ్య వంటి వారు పదే పదే చెప్పడం వెనక కూడా ఇదే కారణం. చంద్రబాబుకు అవసరం లేకపోయినా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అది ఒక్క ఉదాహరణ చాలదూ అంటూ నెట్టింట జనసేన వీర సైనికులు ఆవేదన చెందుతున్నారు.
సీఎం పదవిని...
కానీ చంద్రబాబు నుంచి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం అంత సులువు కాదు. పైగా ఇలా తడవకోసారి చంద్రబాబుతో సమావేశం కావడం వల్ల కాపు సామాజికవర్గంలో చులకన అవుతారన్నది కాదనలేని వాస్తవం. మరి ఎందుకు కలిశారో? ఏం మాట్లాడుకున్నారో? ఆయనకే తెలియాలి. ఎక్కువ సీట్లు కోరుకున్నా దక్కవు. కేవలం వైసీపీని ఓడించాలంటే చేసే ప్రయత్నం ఈసారి ఫలించవచ్చేమో కాని... దీర్ఘకాలంలో పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా ఇబ్బందేనని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు ఇంతకంటే పోయిందేమీ లేదు. ఆయన పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. రాజకీయాల్లో ఆరంభం నుంచి అంతం వరకూ చూశారు. కానీ పవన్ కల్యాణ్ ఇంకా అసెంబ్లీలోకే కాలు మోపలేదు. అధికార వాసన కూడా ఆయన చూడలేదు. మరి ఈ విషయంలో ఆలోచించుకుని అడుగు వేయాల్సింది పవన్ మాత్రమేనని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు.