మాట చెల్లుబాటు కావడం లేదా?

భారత రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు ఉన్నారు. ఆయన సమర్థత ఉన్న నేత

Update: 2023-04-23 06:43 GMT

భారత రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారకరామారావు ఉన్నారు. ఆయన సమర్థత ఉన్న నేత. తండ్రి లాగే మంచి వాగ్దాటి ఉన్న లీడర్. చదువుకున్న యువకుడు. పార్టీకి భావినేత ఆయనే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనే నెంబరు టూ. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయన మాట పార్టీలో చెల్లుబాటు కావడం లేదా? అంటే అవుననే అంటున్నారు. కేవలం కేసీఆర్ కుమారుడిగా పార్టీ బాధ్యతలను చూస్తున్నారు తప్పించి కీలక నిర్ణయాల విషయంలో ఆయన పాత్ర నామమాత్రమేనని చెబుతున్నారు. కేటీఆర్ అంటే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబరు 2 అంటారు. ఆయన నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని భావిస్తారు. కానీ అది నిజం కాదని పలు అంశాలు స్పష్టం చేస్తున్నాయి. తనను నమ్ముకున్న వాళ్లను, తాను నమ్మిన వాళ్లకు కూడా కేటీఆర్ న్యాయం చేయలేకపోతున్నారన్న కామెంట్స్ పార్టీ నేతల నుంచే వినపడుతున్నాయి.

ఎందుకిలా?
మంత్రి కేటీఆర్ ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తారన్న పేరుంది. తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నా ఆయన అవసరం లేకుండానే ఎదిగిన నేతగా చూడాల్సి ఉంటుంది. అనేక మంది ముఖ్యమంత్రులు కుమారులు రాజకీయ వారసత్వం అందుకున్నా అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ కొందరిలో కేటీఆర్ ఒకరు అని చెప్పక తప్పదు. కానీ కొన్ని విషయాల్లో పార్టీలో జరుగుతున్న లోపాలు, లోటుపాట్లు తండ్రి కేసీఆర్‌కు కేటీఆర్ చెప్పలేకపోతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పెట్టడం, టీఆర్ఎస్ పేరు మార్చడం కూడా కేటీఆర్‌కు ఇష్టం లేదనే వారు కూడా పార్టీలో ఉన్నారు. అయినా కేసీఆర్ ఎవరి అభిప్రాయంతో పనిలేకుండా పేరు మార్చారు. జ్యోతిష్యుల మాట నమ్మారో? పేరు మారిస్తే తప్ప మూడోసారి విజయం దక్కదనుకున్నారో తెలియదు కాని పేరు మార్చి పెద్ద తప్పు చేశారని మాత్రం పార్టీలో అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
ఆర్థికంగా బలమైన నేతలను...
ఇప్పటీకీ తెలంగాణ మంత్రుల నుంచి బీఆర్ఎస్ అనే పదం రావడం లేదు. టీఆర్ఎస్ అని వస్తుంది. ఇక ప్రజల్లో బీఆర్ఎస్ అనే పదం బలపడటానికి ఎన్నికల సమయం సరిపోతుందా? అన్న ప్రశ్న కూడా నేతలను పట్టి పీడిస్తుంది. మరోవైపు ఇటీవల సస్పెన్షన్‌కు గురైన పాంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల విషయంలో కూడా కేటీఆర్ నడిపిన మంత్రాంగం నెరవేరలేదంటారు. వారిని పార్టీ నుంచి దూరం చేసుకోవడం కేటీఆర్‌కు సుతారమూ ఇష్టం లేదట. ఖమ్మం జిల్లాకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా పొంగులేటిని కలుస్తుంటారు. ఆయన ఆర్థికంగా బలమైన నేత మాత్రమే కాకుండా సామాజికపరంగా వచ్చే ఎన్నికల్లో అవసరం ఉందన్నది కేటీఆర్ అభిప్రాయమంటారు. అయితే పొంగులేటిని దూరం చేసుకోవడం వల్లే పార్టీకే నష్టమని ఖమ్మం జిల్లా నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.
మంత్రిగా సక్సెస్...
పొంగులేటి స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో తనకు కేటీఆర్‌తో సమస్య లేదని, ఆయన తనను అనేకసార్లు బుజ్జగించారని చెప్పుకొచ్చారు. అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సయితం బలమైన నేతే. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా తమ అనుచరులను నిలబెట్టి గెలిపించుకున్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహబూబ్ నగర్ జిల్లాకు వెళితే జూపల్లి ఇంటికి స్వయంగా వెళ్లి కలసి వచ్చారు. ఆయనతో మాట్లాడి వచ్చారు. కానీ ఆయనను సస్పెండ్ చేయడంతో కేసీఆర్ తనకు అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని, కేటీఆర్ మాటలను కూడా పట్టించుకోవడం లేదని గులాబీ పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. మొత్తం మీద మంత్రిగా కేటీఆర్ సక్సెస్. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాత్రం ఆయన ఎంత మాత్రం విజయం సాధిస్తారన్నది భవిష్యత్‌లోనే తేలుతుంది.


Tags:    

Similar News