ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ కే ఓటేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన తాండూరులో జరిగన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో 24 గంటలూ విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణయేనన్నారు. నిన్న సాయంత్రమే తన వద్దకు సర్వే రిపోర్ట్ వచ్చిందని, టీఆర్ఎస్ పార్టీ 103 నుంచి 106 స్థానాలను గెలుస్తుందని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తనను ఒంటరిగా ఎదుర్కొనడం చేతకాక, అమరావతి పోయి చంద్రబాబును భుజాల మీద తీసుకొస్తున్నారన్నారు.
బాబు పెత్తనం అవసరమా?
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు పెత్తనం అవసరమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు మనకు తెలవని మనిషా..? ఆయన నాలుగున్నరేళ్లలో తెలంగాణను ఎలా అడ్డుకున్నారో అందరికీ తెలుసునన్నారు. ఇంకా తెలంగాణకు వలసవాదుల పాలన అవసరమా? అని ప్రజలను ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గద్దలకు అప్పగిద్దామా? అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవన్నారు. తెలంగాణకు తొలిసారి సోనియా వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఆమె కరీంనగర్ సభలో పాల్గొన్న విషయం తెలియదా? అని నిలదీశారు. సోనియా తొలిసారి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ బిల్డప్ ఇచ్చిందన్నారు. 14 ఏళ్లు పోరాడితే గాని సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తమకు అధికారం ప్రజలు ఎందుకు ఇచ్చారో తెల్వదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మాటలతో మభ్యపెడుతుందన్నారు.