కేసీఆర్ దిగిపోయారు...ఇక...??

Update: 2018-11-19 10:50 GMT

దేశంలోనే ఎక్కడా లేని విధంగా 411 పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకుపోతుందన్నారు. ప్రజలు చైతన్యంతో ఓటేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

- ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ 10కి 10 స్థానాలు గెలుస్తుంది.

- డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది అని కొందరు సొల్లు మాట్లాడతారు. మేము కట్టే ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్, టీడీపీ హయాంలో కట్టిన 16 ఇళ్లకు సమానం. అది కూడా పేదల వద్ద లోన్ల రూపంలో కట్టించేవారు. ఇవాళ రాష్ట్రంలో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లులు నిర్మాణమవుతున్నాయి.

- జీవితంలో కనీవినీ ఎరుగని, ఊహించని విధంగా 411 పథకాలు ప్రవేశపెట్టాము.

- దేశంలో ఎక్కువ జీతాలు తీసుకునే అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, హోం గార్డుల, కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. గత ప్రభుత్వాలు వీరితో వెట్టిచాకిరి చేయించి అర్థాకలితో ఉంచారు.

- ప్రజలు వాస్తవాల ప్రాతిపాదికన ఓట్లేయాలి. కులాలు, మతాల ప్రాతిపాదికన ఓట్లు వెయ్యొద్దు. కులం, మతం కడుపు నింపుతుందా ? కులాన్ని, మతాన్ని అడ్డుపట్టుకుని ఓట్లు అడగితే చెంపదెబ్బ కొట్టాలి.

- తమిళనాడు, కర్ణాటకల్లో ప్రాజెక్టులకు వారి ప్రాంతం వారి పేర్లను పెట్టుకుంటారు. మనవద్ద మాత్రం ఇందిరా, నెహ్రూ, రాజీవ్ అని పేర్లు పెట్టారు. కొమురం భీం వంటి మన మహనీయుల పేర్లు ఎందుకుపెట్టరు ?

- ఖమ్మం జిల్లాను సస్యశామలం చేసే సీతారామ ప్రాజెక్టును అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఖమ్మంకి చంద్రబాబు ప్రచారానికి వచ్చే ముందు సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీయాలి. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఖమ్మంలో ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టారు.

- యావత్తు భారతదేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ.

- తెలంగాణ ప్రభుత్వాన్ని ఐక్య రాజ్య సమితి పొగుడుతుంటే కాంగ్రెస్, టీడీపీ మాత్రం తిడుతోంది.

- టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కూడా కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నరేంద్ర మోదీ కూడా ఫెయిల్ అయ్యారు. ఈ రెండు పార్టీలు దేశానికి పనిచేయవు.

- ఫెడరల్ ఫ్రంట్ ఈ దేశానికి అవసరం. ఢిల్లీలో చక్రం తిప్పుతా, తోక తిప్పుతా అనే చిల్లర మాటలు నేను మాట్లాడను. కచ్చితంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని అదుపు చేసే పాత్ర మాత్రం టీఆర్ఎస్ పోషిస్తుంది.

Similar News