ఈటలతోనే ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు నేతల అవసరం ఉంది. వచ్చే ఎన్నికలు గెలవడం అంత సులువు కాదు.;
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు నేతల అవసరం ఉంది. వచ్చే ఎన్నికలు గెలవడం అంత సులువు కాదు. గట్టి పోటీ ఉంటుందన్నది కేసీఆర్ కు తెలుసు. అందుకే నేతలపై చర్యలు తీసుకునేందుకు కూడా కేసీఆర్ వెనకాడుతున్నారు. ప్రతి నేత వచ్చే ఎన్నికల్లో గెలుపులో కీలక భూమిక పోషిస్తారని భావించి ఆయన చర్యలకు దిగడం లేదు. మరోవైపు ఇతర పార్టీలోకి వెళ్లి ఆ పార్టీని బలోపేతం చేయడం కూడా కేసీఆర్ కు ఇష్టం లేదు. అందుకే ఈటల రాజేందర్ తో చర్యలు ముగిసినట్లేనన్న కామెంట్స్ గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి.
అందుకే ఆయనపై.....
ఈటల రాజేందర్ పార్టీలో బలమైన నేతగా అవతరిస్తారన్న ఏకైక కారణంతోనే ఆయనను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయన భూ కుంభకోణాలు చేశారని తప్పించారనడం ట్రాష్. పార్టీలో ఎప్పటికైనా ఇబ్బంది కల్గిస్తారనే ఆయనను పంపించి వేశారు. ఇక మిగిలిన నేతలను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు. పార్టీకి డ్యామేజీ చేసినా వారిపై చర్యలుండవా? కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
పార్టీకి వ్యతిరేకంగా....
ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ తాతా మధు విజయం సాధించినా ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే పార్టీకి వెనక పోట్లు బాగా పడ్డాయనే చెప్పాలి. దీనికి కారణం ఎవరో అందరికీ తెలుసు. దీనిపై పార్టీ జిల్లా నేతలు అధినాయకత్వానికి నివేదిక కూడా పంపారు. పలానా నేత కారణంగానే తాతా మధుకు పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయని బహిరంగంగానే టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు.
ఆయనంతట ఆయనే....
కానీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బలమైన వర్గం ఓట్లు దూరమవుతాయని భావించి కేసీఆర్ చర్యలకు ఉపక్రమించలేదంటారు. ఆయనంతట ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోతే పరవాలేదు కాని, తాము సస్పెండ్ చేస్తే లేనిపోని సానుభూతి తెచ్చుకుని వెళతారని కేసీఆర్ మిన్నకున్నారంటారు. ఆయన గతంలో ఉన్నత పదవిని వేరే పార్టీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఆయనకు అందుకే ఇంతవరకూ ఏ పదవి కేసీఆర్ ఇవ్వలేదంటారు. ఆయనంతట ఆయనే వెళ్లాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. తనపై సస్పెన్షన్ వేటు వేయాలని సదరు నేత కోరుకుంటున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ముందే ఏదైనా జరగొచ్చేమో కాని ఇప్పుడల్లా చర్యలుండవు. ఆయన పార్టీని వీడేదుండదు.