ఎమ్మెల్యేల్లో పీకే దడ.. దడ..కారణమిదే?

వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.

Update: 2022-06-19 05:27 GMT

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి పార్టీని అధికారంలోకి తేవాలనుకుంటున్నారు. ఆరునూరైనా రాష్ట్రం తమ చేయి దాటిపోకూడాదని ఆయన అన్ని రకాల వ్యూహాలను పన్నుతారు. వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీపై వ్యతిరేకతను ఈసారి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని అంశాలను కప్పిపుచ్చుకోవడానికి ఆయన జాతీయ పార్టీ అంటూ కొత్త కథను మొదలు పెట్టారు. అది సక్సెస్ అవుతుందో లేదో కాని, రాష్ట్రంలో మాత్రం అది ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నది కేసీఆర్ విశ్వాసం.

తరచూ సమావేశం....
మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తరచూ కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఆయన టీం సర్వేలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి పీకే టీం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తుంది. ఈ సర్వే నివేదికలు ఎప్పటికప్పుడు కేసీఆర్ కు నేరుగా అందిస్తుంది. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కన్పిస్తుందని నివేదికల్లో స్పష్టం చేసింది. దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని పీకే టీం సర్వేల్లో నివేదికలో వెల్లడయింది.
సర్వే నివేదికలపై....
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలపై ఎక్కువగా ఆధారపడతారు. గతంలోనూ ఆ సర్వేలే తనను గట్టెక్కించాయని నమ్ముతారు. అందుకే పీకే టీం సర్వే నివేదికలను ఆయన విశ్వసిస్తారు. అయితే ఈ నలభై నియోజకవర్గాల్లో కొందరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒకసారి గెలిచిన వారే ఇందులో ఎక్కువగా ఉన్నారని తెలిసింది. రెండు, మూడుసార్లు గెలిచిన వారి సంఖ్య తక్కువగా ఉందంటున్నారు.
అధికారాన్ని దూరం చేసకోవడానికి....
కేసీఆర్ ఖచ్చితంగా సిట్టింగ్ లను పక్కన పెడతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల కారణంగా పార్టీకి అధికారాన్ని దూరం చేసుకోరు. అందుకే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం నియోజకవర్గాల్లో అభ్యర్థిపైన కూడా కేసీఆర్ సర్వే చేయిస్తున్నారట. రెండు, మూడు పేర్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వాలని ఐప్యాక్ టీంకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. అదే జరిగితే అనేక మంది సిట్టింగ్ సీట్లు చిరిగి పోయే అవకాశముంది. అందుకే ప్రగతి భవన్ కు ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడంటే ఎమ్మెల్యేల్లో దడ పుడుతుందట. సీట్లు ఇవ్వలేకపోయిన సిట్టింగ్ లకు కేసీఆర్ పదవుల హామీ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నికలకు ఆరు నెలలు ముందు మాత్రమే తెలుస్తోంది.


Tags:    

Similar News