మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా నకిరేకల్ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. నకిరేకల్ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. నకిరేకల్ లో టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వీరేశం అరాచకాలకు చెరమగీతం పాడాలంటే చిరుమర్తికే టిక్కెట్ ఇవ్వాలని పేర్కొన్నారు.
తానూ పోటీ చేయరట.....
ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోతే తాను కూడా నల్గొండలో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్యనేతలను తమ అనుచరులు ఓడించే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఇక, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి కూడా ఇటీవల ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చిరుమర్తికి టిక్కెట్ ఇవ్వకపోతే తాను కూడా మునుగోడు నుంచి పోటీచేయనని స్పష్టం చేశారు. నకిరేకల్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన చిరుమర్తి లింగయ్య.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శిష్యుడు.