తెలంగాణలో మహాకూటమిలో సీట్ల పంపకాల లొల్లి తారస్థాయికి చేరింది. కూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం అవుతున్నందున తాము పోటీ చేసే స్థానాలను సీపీఐ ప్రకటించేసింది. సోమవారం హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మహాకూటమికి ప్రజల్లో మంచి ఆధరణ లభిస్తోందని, అయినా సీట్ల పంపకాలు తేలక నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు త్వరగా పూర్తి చేయాలని మొదటినుంచీ తాము చెబుతున్నామని, అయినా ఆలస్యం జరుగుతుందన్నారు. తాము కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక నియోజకవర్గాల్లో తాము పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు తేల్చకపోతే ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇవికాక మరో 20 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతామన్నారు. తమ పార్టీకి 40 నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఓటుబ్యాంకు ఉందన్నారు. ఇప్పటికైనా సీట్ల సర్దుబాటు త్వరగా పూర్తిచేయాలన్నారు.