మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా సద్దుమణగడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్బీనగర్ సీటును ఆశించిన సామ రంగారెడ్డికి ఆ పార్టీ ఇబ్రహీంపట్ల స్థానాన్ని కేటాయించింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తుండటంతో కాంగ్రెస్ ఎల్బీనగర్ కి బదులు ఇబ్రహీంపట్నంని టీడీపీకి వదులుకుంది. దీంతో ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో లొల్లి మొదలైంది. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక క్యామ మల్లేష్ కూడా టిక్కెట్ పోరులో ఉన్నారు. వీరిద్దరినీ కాదని ఎల్బీనగర్ కు చెందిన సామ రంగారెడ్డికి టిక్కెట్ కేటాయించడం పట్ల వారు భగ్గుమంటున్నారు. అదే సమయంలో టీడీపీ ఇబ్రహీంపట్నం నేత రొక్కం భీంరెడ్డి తాను స్థానికుడినని, తానే పోటీ చేస్తానని నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
అధిష్ఠానాల వద్దకు చేరిన లొల్లి
తాను అడిగిన ఎల్బీనగర్ ఇవ్వకుండా కొత్త నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం ఇవ్వడం పట్ల సామ రంగారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. తాను ఓడిపోయేందుకే కొత్త నియోజకవర్గం ఇచ్చారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి సహకరించకపోతే ఓడిపోతానని ఆయన భావిస్తున్నారు. దీంతో ఆయన అధినేతను కలవడానికి వెంటనే అమరావతి వెళ్లారు. అయితే, అక్కడా సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం నుంచే పోటీ చేయాలని, ఎల్బీనగర్ ఇవ్వలేమని చంద్రబాబు సూచించారు. ఇక మల్ రెడ్డి రంగారెడ్డి అధిష్ఠానం వద్ద తేల్చుకోవడానికి ఢిల్లీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ ఓడిపోతుందని, కచ్చితంగా తనకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అయినా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.