అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాంగ్రెస్ కాదని, అధికారం లేదని కుంగిపోమని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీది పోరాటాల చరిత్ర అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున పోరాడతామన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పక్షాన నిలబడ్డ వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బతికే ఉంటుంది.....
కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని, 1994లో రాష్ట్రంలో 294 మంది శాసనసభ్యులు ఉంటే కాంగ్రెస్ 26 మాత్రమే గెలిచిందని, అయినా తిరిగి నిలదొక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ కి గెలుపోటములు సహజమని, కార్యకర్తలు కుంగిపోవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలకు కార్యకర్తలంతా సన్నద్ధం కావాలన్నారు. గెలుపు శాశ్వతమనుకుని అహంకారంతో మాట్లాడటం కేసీఆర్ అమాయకత్వమని పేర్కొన్నారు. ఎదుటి పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈసారి అటువంటి ప్రయత్నాలకు తమ ఎమ్మెల్యేలు లొంగరని పేర్కొన్నారు.