ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 110 అడుగుల పొడవైన జుట్టు.. గిన్నీస్ రికార్డుకెక్కిన మహిళ
దాదాపు 40 ఏళ్లుగా జుట్టును కత్తిరించుకోకుండా పెంచుతోంది. పదమూడేళ్ల క్రితం అంటే 2009లోనే ఆశా సుమారు 20 అడుగుల..
ఈరోజుల్లో అంతో ఇంతో పొడుగైన జుట్టున్న వాళ్లు ఉండటమే అరుదు. ఉన్న జుట్టును కత్తిరించుకుని పోనీటెయిల్ అంటూ చిన్ని పిలక వేసుకుని తిరుగుతున్నారు. ఇలాంటి రోజుల్లో ఏకంగా 110 అడుగుల జుట్టుతో గిన్నీస్ రికార్డుకు ఎక్కిందో మహిళ. అందునా ఆమె అమెరికాలో ఉంటున్న ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ. తనకన్నా రెండు మూడింతల పొడవు జుట్టును పెంచి రికార్డు సృష్టించింది. ఏకంగా 110 అడుగుల పొడవైన డ్రెడ్ లాక్స్ (వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా చిక్కు పడిన) జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటోన్న ఆశా మండేలా దాదాపు 40 ఏళ్లుగా జుట్టును కత్తిరించుకోకుండా పెంచుతోంది. పదమూడేళ్ల క్రితం అంటే 2009లోనే ఆశా సుమారు 20 అడుగుల (ఆరు మీటర్లు) పొడవైన డ్రెడ్ లాక్స్ జుట్టుతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఆ తర్వాత కూడా ఆమె జుట్టును పెంచుతూనే ఉంది. ఇటీవల గిన్నీస్ బుక్ ప్రతినిధులు ఆమెను కలవగా.. తన జుట్టు రికార్డును మళ్లీ నమోదు చేయాలని కోరిందట. దాంతో వారు ఆమె జుట్టును కొలిచారు. ఏకంగా 110 అడుగుల(33.5 మీటర్లు) పొడవు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది తనకు కేవలం జుట్టుమాత్రమే కాదని, తన కిరీటమని ఆశా మండేలా చెప్పడం గమనార్హం.
ఇంత జుట్టును ఎందుకు పెంచావని అడిగితే.. ఆధ్యాత్మిక మార్గంలో భాగంగానే జుట్టును పెంచుతున్నట్లు చెప్పుకొచ్చింది. సుమారు 40 సంవత్సరాలుగా తాను జుట్టును కత్తిరించలేదని పేర్కొంది. తన జుట్టును ఒక్కసారి శుభ్రం చేసుకోవాలంటే ఐదారు షాంపూ బాటిళ్లు అవసరం పడతాయని.. ఆర బెట్టుకోవడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని తెలిపింది.