భర్త కోసం.... కుమారుడి భవిష్యత్ కోసమేనట

భువనేశ్వరి ఏపీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరుపున సాయం అందిస్తుంది.;

Update: 2021-12-20 02:22 GMT

పుట్టిందే ధనవంతుల కుటుంబం. బంగారు ఊయలలో ఊగారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టారంటారు చూడండి. అలాగన్న మాట. తండ్రి, భర్త ముఖ్యమంత్రులయినా సరే ఆమె సాధారణ గృహిణిగానే ఉన్నారు. ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పుడప్పుడు అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు, ఇతర సేవా కార్యక్రమాల్లో మాత్రమే ఆమె పాల్గొనేవారు. రాజధాని రైతుల ఆందోళనలకు అండగా నిలచేందుకు తన చేతి గాజులు ఇచ్చి తన మనసును చాటుకున్నారు. ఆమె నారా భువనేశ్వరి.

కొత్తగా వచ్చిన ప్రత్యేకత....
ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ప్రత్యేకత కొన్ని దశాబ్దాల క్రితమే వచ్చింది. ఇంక అంతకు మించి గుర్తింపు హెరిటేజ్ సంస్థను లాభాల బాటలో పరుగులు తీయించి మహిళా పారిశ్రామికవేత్తగా మరింత రాణించారు. చంద్రబాబు దాదాపు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు, అయినా ఆమె ఎప్పుడూ రాజకీయాలను గురించి పట్టించుకోలేదు. రాజకీయాలతో అలసి పోయి ఇంటికి వచ్చిన చంద్రబాబు బాగోగులను చూసుకుందే తప్పించి ఏరోజూ పాలిటిక్స్ గురించి కూడా ఆరా తీయలేదు.
రాజకీయ ప్రాధాన్యత....
అలాంటి భువనేశ్వరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వరద బాధితులకు ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరుపున సాయం అందిస్తుంది. వరదల వల్ల మరణించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆమె స్వయంగా తన చేతులతో బాధిత కుటుంబాలకు అందజేయనుంది. ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సేవలందించడంలో ముందుంటుంది కదా? ఇందులో కొత్తేముంది అని అనుమానం రావచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సేవలందిస్తుంది. కానీ ఎప్పుడూ భువనేశ్వరి బయటకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఏదైనా మీడియా సమావేశాల్లో మాట్లాడటం తప్పించి క్షేత్రస్థాయిలో ఎప్పుడూ పర్యటించలేదు.
బాబు సూచనలతోనే...
కానీ సడెన్ గా ఆమె స్వయంగా బాధితుల వద్దకు వెళ్లడం తొలిసారి అనుకోవచ్చు. తిరుపతిలో వరదలకు మరణించిన కుటుంబాలను కలుసుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఇటీవల తన భర్త చంద్రబాబు కన్నీరు మున్నీరుగా ఏడవటమే. అసెంబ్లీలో తనను దూషించారని చంద్రబాబు గుక్కపెట్టి ఏడ్చారు. ఆయన జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. దీంతోనే భువనేశ్వరి బాబు సూచనలతోనే భువనేశ్వరి నేరుగా బాధితుల వద్దకు వస్తున్నారు. తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం కూడా ఆమె పర్యటనలు చేయాల్సి వస్తుంది. దాదాపు 48 మంది బాధిత కుటుంబాలను భువనేశ్వరి కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు భువనేశ్వరి ప్రధాన ప్రచారకర్తగా మారనున్నారనడానికి ఇది ఉదాహరణ మాత్రమే.


Tags:    

Similar News