ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు దేశ భవిష్యత్తుకు, ప్రజలకూ తీవ్ర ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో పార్లమెంటు అనెక్స్ హాల్లో బిజెపి వ్యతిరేక పార్టీల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమది ప్రజా గళమని పేర్కొన్నారు. దేశం కోసం పార్లమెంట్ బయటా, లోపలా బిజెపి ప్రభుత్వంపై ఏ విధంగా పోరాడాలో సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. దేశ ప్రజల గొంతుకను తమ ద్వారా వినిపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బిజెపిపై పార్లమెంట్ లోపల, బయటా ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు వివరించారు. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన 25 మంది నాయకులు సమావేశంలో కలవడం శుభ పరిణామన్నారు. సేవ్ ఇండియా- సేవ్ డెమోక్రసీ కోసమే బిజెపి వ్యతిరేక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. సిబిఐ, ఈడీ, ఆర్బీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రజల కోసం ఎంతో సేవ చేశారని చివరకు ఒత్తిడి తట్టుకోలేక ఆయన రాజీనామా చేశారని చెప్పారు.
రెండు మూడు పార్టీలు మాత్రమే....
ప్రస్తుతం పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో రెండు, మూడు పార్టీలు దూరంగా ఉన్నాయని., దేశం కోసం వారితో కూడా మరోసారి మాట్లాడి అందరినీ కలుపుకు పోవడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమావేశంలో చర్చించినట్లు చంద్రబాబు వివరించారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కొన్ని పార్టీల నేతలు విలువైన సలహాలు ఇచ్చారన్నారు. సేవ నేషన్, సేవ్ డెమోక్రసీ కోసం అందరినీ కలపుకుని ముందుకెళ్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మ్ హన్ సింగ్, కేజ్రీవాల్, శరద్ పవార్, ఫరూఖ్ అబ్ధుల్లా, మమతా బెనర్జీ, శరద్ యాదవ్, దేవెగౌడ,స్టాలిన్, డి.రాజా, సురవరం సుధాకర్ రెడ్డి, సీతారాం ఏచూరి తదితరులు పాల్గొన్నారు.