బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన సమయంలో లౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ వ్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఇదేరోజు పెద్దనోట్లను రద్దు చేశారని, ఆ ఇబ్బందులు నేటికీ తొలగలేదని చంద్రబాబు చెప్పారు. అందరూ కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాను బెంగళూరుకు వచ్చానన్నారు. నాలుగున్నరేళ్లగా దేశం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు.