తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన ఎన్డీటీవీ

Update: 2018-12-04 08:41 GMT

తెలంగాణ ఎన్నికలపై ఎన్డీటీవీ ఆసక్తికర విశ్లేషణ చేసింది. ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ స్వయంగా కొన్నిరోజులు తెలంగాణలో పర్యటించి ఇక్కడి పరిస్థితిని విశ్లేషించారు. అన్ని పార్టీల ముఖ్యనేతలు, వివిధ వర్గాల వారితో ఆయన స్వయంగా మాట్లాడారు. అనంతరం తెలంగాణలో రాజకీయ పరిస్థితిని ఎన్డీటీవీ అంచనా వేసింది. ఓపీనియన్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ 66 స్థానాలు, ప్రజాకూటమి 39 స్థానాలు, ఎంఐఎం 7, బీజేపీ 4 సీట్లు, ఇతరులు 3 సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, టీఆర్ఎస్ - ప్రజాకూటమి మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా ఉంటుందని తేల్చింది. ఈ విశ్లేషణ టీఆర్ఎస్ తో పాటు ప్రజాకూటమిని కూడా అలెర్ట్ చేసింది. కేవలం 2 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉండటంతో రెండు పక్షాలు మరింత జాగ్రత్త పడనున్నాయి.

ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్ దే...

టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలు విజయవంతమయ్యాయని, ఈ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఎక్కువగా ఉందని స్పష్టమైంది. ఇక మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ వంటి పథకాలు మాత్రం ఆశించి ఫలితం ఇవ్వలేదని తేలింది. ఇదే సమయంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో మాత్రం టీఆర్ఎస్ సర్కార్ విఫలమైనట్లు ప్రజలు భావిస్తున్నారని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతం కంటే పట్టణ ప్రాంత ఓటర్లు టీఆర్ఎస్ పట్ల ఎక్కువ అనుకూలంగా ఉన్నారని తేలింది. ఇక ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉన్నా... దక్షిణ తెలంగాణలో మాత్రం అంతగా బలంగా కనిపించడం లేదని ఎన్డీటీవీ విశ్లేషించింది.

Similar News