జల్లెడ పట్టి చూసినా జాడ లేదే?

బీజేపీలో చేరేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. దీనికి కారణం ఆ పార్టీకి ఇక్కడ బేస్ లేకపోవడమే.

Update: 2022-01-17 03:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఆచూకీ కన్పించకుండా పోయింది. ఆ పార్టీ నేతల ప్రకటనలు ఆర్భాటమే తప్పించి ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. నెలన్నర రోజుల క్రితం అమిత్ షా తిరుపతి వచ్చారు. ఏపీ బీజేపీ నేతలకు క్లాస్ పీకారు. రాజధాని అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలని చెప్పారు. ఒకరోజు పాల్గొన్నారు. ముగింపు సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని షా మాటలకు విలువనిచ్చారు. ఆ తర్వాత దాని ఊసే వదిలి పెట్టారు. అది వేరే సంగతి.

చేరికలపై....
ఈ సమావేశంలోనే అమిత్ షా పార్టీలో చేరికలు ఉండాలని ఆదేశాలు జారీ చేసి వెళ్లారని వార్తలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సయితం త్వరలోనే పార్టీలో జాయినింగ్స్ ఉంటాయని ఆర్భాటంగా ప్రకటించారు. అన్ని పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఇక కండువాలు కప్పడమే తరువాయి అంటూ కలరింగ్ ఇచ్చారు. అది నిజమేననుకుని పార్టీ క్యాడర్ ఖుషీ అయింది.
ఎవరూ ముందుకు రాక....
కానీ బీజేపీలో చేరేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. దీనికి కారణం ఆ పార్టీకి ఇక్కడ బేస్ లేకపోవడమే. జనసేన పార్టీ పొత్తు ఉన్నప్పటికీ దానిపై నమ్మకం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. విభజన తర్వాత ఏపీకి పెద్దగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉపయోగపడకపోవడం, ఉన్న సంస్థలను ప్రయివేటు పరం చేయడం, పెట్రోలు, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రజలు ఆపార్టీకి దూరమయినట్లే కన్పిస్తుంది.
ఉన్న నేతలు కూడా....
ఇక ఉన్న నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల వారీగా చేరికల కోసం బీజేపీ నేతలు జల్లెడ వేసి చూస్తున్నా ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. బీజేపీ కంటే జనసేనలో చేరితే ఫ్యూచర్ ఉంటుందన్న భావన నేతల్లో వ్యక్తమవుతుంది. ఇక వచ్చే ఎన్నికలలో ఏ పార్టీలో టిక్కెట్లు రాని వారు తప్ప ఏపీ బీజేపీ వైపు ఎవరూ కన్నెత్తి చూడరన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు ఉన్న నేతలు పార్టీని వీడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీ అగ్రనేతలపై ఉంది. లేకుంటే అలా వచ్చి సెటిల్ అవుదామనుకుంటున్న వారు సయితం వెళ్లిపోతారు.


Tags:    

Similar News