బాలినేనికి డేంజర్ బెల్స్.. నిజమేనట

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత కనపడుతుంది;

Update: 2021-12-25 07:47 GMT

అవును .. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకత ఉంది. సుబ్బారావు గుప్తా చెప్పిన దాంట్లో తప్పేమీ కనిపించడం లేదు. బాలినేని ఓటమి పాలయితే ఒంగోలులోనే ఉండరు. అది అందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని సుబ్బారావు గుప్తా చెప్పారు. మీరు ఓడిపోతే హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ వైసీపీ నేతలమైన తమను టీడీపీ ఈసారి సైకిల్ చైన్లతో కొడుతుందని హెచ్చరించారు. నిజమే కదా? నిజానికి ఇప్పటి నుంచి కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయితే ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శ ఈనాటిది కాదు.

లక్ అలా....
అదేమో కాని బాలినేని శ్రీనివాసరెడ్డి అదృష్టమో, ప్రత్యర్థి పార్టీల దురదృష్టమో కాని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఓటమిపాలయితే ప్రజలకు, క్యాడర్ కు అందుబాటులో లేకపోయినా లక్ ఆయనకు అలా కలసి వచ్చింది. సామాజికపరంగా మాత్రమే కాకుండా రాజకీయ పరిణామాలు కూడా బాలినేనికి అలా కలసి వచ్చాయి. జిల్లా యువజన కాంగ్రెస్ నేత గా రాజకీయ అరంగేట్రం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. వైఎస్ హయాం నుంచి ఆయన పంట పండింది.
ఇతరులకు పదవులు...
నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సమకాలికులైన మంత్రి శ్రీనివాసరావు, కాకుమాను రాజశేఖర్ లకు కాలం కలిసి రాలేదు. ముగ్గురూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా మంత్రి శ్రీనివాసరావు మున్సిపల్ ఛైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దళిత కుటుంబానికి చెందిన కాకుమాను రాజశేఖర్ కూడా నామినేటెడ్ పదవితో సంతృప్తి పడిపోయారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం రాజకీయంగా ఎదిగారు. అయితే ఈసారి మాత్రం ఆయన పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా ఇతరులకు పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. పార్టీలోనూ ఆయన అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు.
గుప్తా అన్నారు కాని....
అధికారంలో ఉండటం, మంత్రిగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది బయటపడటం లేదు కాని సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలతో అనేక మంది ఏకీభవిస్తున్నార. కానీ ఆయనలా బయటపడటం లేదు. ఇప్పుడు సుబ్బారావు గుప్తా నోరును మూయించవచ్చు. కానీ రానున్న కాలంలో సొంత పార్టీ నేతలే బాలినేనికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా బాలినేని శ్రీనివాసరెడ్డి తనపై ఉన్న , వస్తున్న వ్యతిరేకతను తొలగించుకోకుంటే మరోసారి హైదరాబాద్ కే పరిమితమవ్వక తప్పదన్న హెచ్చరికలు విన్పిస్తున్నాయి.


Tags:    

Similar News