రాష్ట్రీయ హిందూ సేన అధినేత స్వామి పరిపూర్ణాంద హైదరాబాద్ లో అడుగుపెట్టారు. మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. ఆయనను తీసుకెళ్లి కాకినాడలో వదిలి వచ్చారు. అయితే, ఈ బహిష్కరణ చెల్లదంటూ ఆయన కోర్టుకు వెళ్లగా స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది. నగర బహిష్కరణ చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ కు చెందిన హిందూవాదులు ఆయనను నగరానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో మంగళవారం విజయవాడలో దుర్గమ్మ దర్శనం తర్వాత ఆయన హైదరాబాద్ కి బయలుదేరారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, బీజేపీ, వీహెచ్పీ, ఆర్.హెచ్.ఎస్ నేతలు స్వామికి భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఆయన వచ్చే దారిలో ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటుచేసి స్వాగతం పలికారు. పెద్దఎత్తున ర్యాలీగా నగరానికి చేరుకున్నారు.
55 ఏళ్లు ఇక్కడే ఉంటా..!
ఈ సందర్భంగా స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ... భాగ్యనగరంలో హిందూ సముద్రం ఉందని, హుస్సైన్ సాగర్ లో బోట్లు తిరుగితే హిందూ సముద్రంలో ఓట్లు తిరగబోతున్నాయని ఆయని పేర్కొన్నారు. తనను 55 రోజులు హైదరాబాద్ నుంచి బహిష్కరించారని, కానీ, తాను 55 ఏళ్లు ఇక్కడ జీవించడానికి వస్తున్నానని స్పష్టం చేశారు. తన బహిష్కరణ చెల్లదని కోర్టు చెప్పడం ద్వారా ధర్మం మరోసారి సజీవంగా ఉందని పేర్కొన్నారు. మొత్తానికి స్వామి పరిపూర్ణానంద బలప్రదర్శనగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు.