20 మంది ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్
వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు
వైసీపీ నేతలతో పార్టీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ నుంచి జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 18వ తేదీకి వాయిదా వేశారు. మార్చి 18వ తేదీని నుంచి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమావేశంలో జగన్ ప్రకటించారు. గడప గడపకు ప్రభుత్వంపై కూడా జగన్ సమీక్షించారు. గ్రామాల్లోకి వెళ్లని ఎమ్మెల్యేలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, సామినేని ఉదయభాను వంటి వారిపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కార్యక్రమం వాయిదా...
దీంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా జగన్ సమీక్షించినట్లు తెలిసింది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో ఈ ఏడాది మమేకం కావాలని, సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నించాలని జగన్ కోరారు. మండలాల వారీగా జరిగే శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని కోరారు. గృహసారధులను సమన్వయం చేసుకునే బాధ్యతలను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా జగన్ చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల విషయంలో ఇబ్బంది లేదు కాని, పట్టభద్రుల ఎమ్మెల్సీలపై దృష్టి పెట్టాలని జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.