తుమ్మలకు ఆ ప్రామిస్ వచ్చిందా?
తుమ్మల నాగేశ్వరరావును యాక్టివ్ కావాలని పార్టీ కోరినట్లు తెలిసింది.. పదవులు గ్యారంటీ అని హామీ ఇచ్చినట్లు సమాచారం
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. కేసీఆర్ అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో కమ్మ సామాజికవర్గం కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే అన్ని సామాజికవర్గాల వారీగా ఆయన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పదవుల పంపకాన్ని చేపడుతున్నారు. కానీ కమ్మ సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే తుమ్మల నాగేశ్వరరావును మాత్రం విస్మరించారు.
ఓటమి పాలయిన తర్వాత....
తుమ్మల నాగేశ్వరరావు 2014 లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయనను వెంటనే ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఉప ఎన్నిక జరిగిన పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తుమ్మల గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో అదే పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పదవులు లేకుండానే...?
దీంతో ఆయనకు ఇప్పటి వరకూ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. కానీ తుమ్మలకు మాత్రం ఎటువంటి పదవులు దక్కలేదు. దీంతో ఆయన కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల పదుల సంఖ్యలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయినా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఎక్కడా విన్పించలేదు. అయితే ఖమ్మం ఎమ్మెల్సీ లో జరిగిన క్రాస్ ఓటింగ్ టీఆర్ఎస్ అధిష్టానాన్ని భయపెట్టినట్లుంది.
నాయకత్వం హామీతో....
అందుకే తుమ్మల నాగేశ్వరరావును యాక్టివ్ కావాలని పార్టీ నాయకత్వం కోరినట్లు చెబుతున్నారు. భవిష్యత్ లో పదవులు గ్యారంటీ అని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతోనే తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాతా మధు అభినందన సభలో పాల్గొన్నారు. ఒకచోట ఉండి మరొక చోట కాపురం చేయడం సరికాదని తుమ్మల పార్టీలో కోవర్టులకు సూచించారు. కొందరు పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని, వారి వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు. ఇంతకీ పార్టీ నాయకత్వం తుమ్మలకు ఎలాంటి హామీ ఇచ్చిందన్నది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.