పవన్ పోటీ ఇక్కడి నుంచే.. ఇక ప్రకటించడమేనా?

ఈసారి ఒకచోట నుంచే పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.;

Update: 2022-12-12 07:51 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? ఆయన ఈసారైనా అసెంబ్లీలోకి అడుగు పెడతారా? పవన్ గెలిచేందుకు అనువైన నియోజకవర్గాలు ఏవి? పవన్ కు కేవలం కాపు సామాజికవర్గం నుంచే కాకుండా అభిమానుల ఓట్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఈ దిశగా ఒక సర్వే సంస్థ ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఒకచోట నుంచే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మాదిరి రెండు చోట్ల కాకుండా ఈసారి ఒకేచోట నుంచి పోటీ చేసి అక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్లాలన్నది జనసేనాని యోచన.

నాలుగైదు నియోజకవర్గాల్లో....
అందుకు అనుగుణంగా నాలుగైదు నియోజకవర్గాల్లో ఈ సంస్థ ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. అక్కడ పార్టీ ప్రభావంతో పాటు పవన్ కు ఉన్న అభిమానుల సంఖ్య, ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు వంటివి ఈ సర్వేసంస్థ అంచనా వేస్తుంది. ఎక్కువ సంఖ్యలో జనాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. పవన్ పోటీ చేస్తే ప్లస్ ఏంటి? మైనస్ లు ఏంటి? ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరు అభ్యర్థులు ఉంటారన్న అంచనా వేసి మరీ ఈ సర్వేను నిర్వహిస్తున్నారని తెలిసింది. అక్కడ ప్రధానంగా వైసీపీ, తెలుగుదేశం బలాబలాలను కూడా పరిగణనలోకి తీసుకుని సర్వేను చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
ముందస్తు కసరత్తు లేకుండా....
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నంలోని గాజువాక నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీ అధినేతగా పవన్ కు ఈ ఓటమి తలవంపులు తెచ్చిపెట్టింది. పార్టీ పెట్టిన పదేళ్లకు కూడా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ముందు తర్వాత తమను విమర్శించాలని ప్రత్యర్థి పార్టీలు సవాళ్లు కూడా విసురుతున్నాయి. అందుకే ఈసారి పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
ఈ రెండింటిలో ఒక్కటిట...
పవన్ కల్యాణ్ ఈసారి తిరుపతి నియోజకవర్గం కాని, కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కాని పోటీ చేసే అవకాశాలు ఎక్కువగ కనిపిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గం కూడా పరిశీలనలో ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కొంత బలహీనంగా ఉండటం, అక్కడ కాపు సామాజికవర్గం బలంగా ఉండటం, అభిమానుల సంఖ్య కూడా అపరమితంగా ఉండటంతో అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తాను అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి రావడంతో ఎక్కడ సులువుగా విజయం సాధించవచ్చన్న దానిపైనే ఎక్కువగా సర్వే సంస్థ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇటు సీమ నుంచి కానీ లేదా తన పార్టీకి పట్టున్న తూర్పు గోదావరి జిల్లా నుంచే ఈసారి పవన్ కల్యాణ్ పోటీకి దిగే అవకశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News