2014 "సీన్" ఇప్పుడుందా?

2014 ఎన్నికల తరహాలో మూడు పార్టీలు పొత్తులతో కలసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందన్న సంకేతాలు పవన్ కల్యాణ‌్ జనంలోకి పంపారు

Update: 2022-12-20 06:51 GMT

రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రజల మూడ్ కూడా ఎప్పుడూ ఒకలా ఉండదు. రాజకీయాల్లో ఒక పార్టీ గెలవడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి పలానా అని చెప్పలేం కానీ ఏపీలో మాత్రం కులం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనని పవన్ సత్తెనపల్లిలో మరోసారి రిపీట్ చేశారు. 2014 లో మాదిరి కూటమి లేకపోవడం వల్లనే 2019లో ఓటమి పాలయ్యామని తెలిపారు. అంటే 2014 లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి ఒక కూటమిగా ఏర్పడతాయని ఆయన పరోక్షంగా తెలిపారు. జనసేన వర్గాలు మాత్రం పవన్ కామెంట్స్ కు కొత్త భాష్యం చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేనకు వచ్చేలా చూస్తానని మాత్రమే పవన్ చెప్పాడంటున్నాయి.

అప్పుడంటే...?
2014 పరిస్థితులు వేరు. అప్పుడు రాష్ట్రం కొత్తగా విడిపోయింది. రాష్ట్రాన్ని విభజించిందన్న కారణంతో కాంగ్రెస్ పైన ప్రజలతో కసితో రగిలపోయారు. బీజేపీ పై పెద్దగా వ్యతిరేకత అప్పుడు లేదు. మోదీ ఇమేజ్ కు తిరుగులేదు. దీనికి తోడు విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగింది చంద్రబాబు మాత్రమే అని నాడు జనం నమ్మారు. తెలంగాణకు పోటీగా ఏపీని అభివృద్ధి చేయగలిగింది చంద్రబాబు మాత్రమేనని విశ్వసించారు. అందుకే ఆరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు పవన్ కల్యాణ్ వల్ల నాడు ప్రత్యేకంగా టీడీపీకి ఒరిగిందేమీ లేదు. అలాగే వైసీపీికి నాడు జరిగిన నష్టం ఏమీ లేదనే చెప్పుకోవచ్చు.

అనేక కారణాలు...
ఇక వైసీపీ అధినేత జగన్ యువకుడు కావడం, అవినీతి ఆరోపణలను ఎదుర్కొనడం వంటి కారణాలు కూడా 2014లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడకపోవడానికి కారణంగా చెప్పాలి. విడిపోయిన రాష్ట్రాన్ని యువకుడైన జగన్ సమర్థంగా నడపలేడని అనేక మంది నాడు భావించారు. అయినా అప్పుడు కూడా వైసీపీకి అరవైకి పైగా స్థానాలు దక్కాయి. అంటే తీవ్రస్థాయిలో నాడు కూడా జగన్ పార్టీపై వ్యతిరేకత లేదని అర్ధమయింది. కానీ ఇప్పుడు 2104లోని రాజకీయ పరిస్థితులు ఏపీలో ఉన్నాయని అనుకుంటే భ్రమే. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. జనసేన కు వచ్చిన ఓట్లు కేవలం ఆరు శాతం మాత్రమే. తెలుగుదేశం పార్టీకి నలభై శాతానికి పైగా ఓట్లు సాధించింది.

అప్పటికంటే ఇప్పుడు...
అయితే 2014 కంటే జగన్ పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఒకసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పరచుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని వర్గాలు జగన్ పాలన పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన స్థానాలు రాకపోవచ్చు. కానీ 2014 కంటే వైసీపీ తన బలాన్ని మరింత పెంచుకుందనే చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా ప్రకటించడం, సంక్షేమ పథకాల అమలు వంటి వాటితో నాటికంటే జగన్ సర్కార్ బలంగా ఉందని మాత్రం చెప్పాలి. అంతే తప్ప 2014లో ఉన్నంత బలహీనంగా మాత్రం వైసీపీ లేదని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నష్టపోయేది టీడీపీయేనా?
ఇక 2014 తరహాలో మూడు పార్టీలు కలిసినా నష్టపోయేది చివరకు టీడీపీనేన్నది ఆ పార్టీ నేతలకూ తెలుసు. కొన్ని స్థానాలను చేజేతులా చేజార్చుకోవాల్సి వస్తుంది. పార్టీలో అసమ్మతి పెరిగి రెబల్స్ తో నష్టపోతారు. 2014లో జనసేన పోట ీచేయలేదు. కానీ ఇప్పుడు పోటీ చేస్తుంది. ముందుగా పొత్తు అంటే కొన్ని స్థానాలను టీడీపీ త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని వర్గాలను దూరం చేసుకుని మరీ పవన్ తో చేతులు కలపాల్సి ఉంటుందన్నది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న కామెంట్స్. తూర్పు, పశ్చిమ గోదావరి, కోస్తాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు పవన్ తో పొత్తు కోరుకుంటున్నారు కానీ, మిగిలిన ప్రాంత సైకిల్ పార్టీ తమ్ముళ్లు ఒంటరిగా పోటీ చేయడమే మేలని భావిస్తున్నారు.

పొత్తులతోనే గెలుపు సాధ్యమా?
ఇలా 2014 లెక్కలకు, ఇప్పటికి గణాంకాలకు మధ్య పోలికే లేదు. రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమే అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సార్లు జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. మహాకూటమిలు ఏర్పడినా మట్టికరిచారు.అందువల్ల పొత్తులతోనే విజయం ఎప్పటికీ దక్కదు. ప్రజలకు నమ్మకం కలగడం, ప్రస్తుత ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత పెరిగితే ఆ గెలుపును ఎవరూ ఆపలేరు. మరీ వైసీపీపై జనంలో అంత వ్యతిరేకత ఉందా? లేదా? అన్నది రానున్న కాలంలో చూడాల్సి ఉంది.


Tags:    

Similar News