మంత్రి మేకపాటి మృతి పట్ల సంతాపం ప్రకటించిన రాజకీయ ప్రముఖులు

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఏపీ మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు,

Update: 2022-02-21 08:07 GMT

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఏపీ మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు, గౌతమ్ రెడ్డి అభిమానులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.

మంత్రి మేకపాటి మృతికి చంద్రబాబు సంతాపం
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివి, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరం అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి
ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో గుండెపోటుతో హఠాన్మరణం చెందడం అత్యంత భాదాకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబీకులు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసింది
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాల్సిన గౌతమ్ రెడ్డిని మృత్యువు కబళించి, ఆ కుటుంబానికి రాజకీయ రంగానికి తీరని లోటును మిగిల్చిందన్నారు. గౌతమ్ రెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా అందిరితో ఆప్యాయంగా కలిసి, హుందాగా ప్రవర్తించేవారని గుర్తుచేసుకున్నారు. ‎ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
మంత్రి మేకపాటి మృతిపట్ల ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి చెందారు. చిన్నవయసులోనే ఇలాంటి రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. నిన్నటి వరకూ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దుబాయ్ లో పర్యటించిన మంత్రి మేకపాటి.. నేడు లేరన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఆనం రాంనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లు మేకపాటి మృతి పట్ల సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తమను తీవ్రంగా కలచివేసిందని ఈ ముగ్గురు నేతలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వివాద రహిత మంత్రిగా పనిచేసిన మేకపాటి లాంటి రాజకీయ నేత మున్ముందు ఉండబోరన్నారు. నెల్లూరు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలని మేకపాటి తపించేవారని ఆనం పేర్కొన్నారు. తనకు సమీప బంధువైన గౌతమ్ రెడ్డిని.. నిన్న రాత్రే నెల్లూరులో ఓ వేడుకలో కలిశానని, ఉదయానికి అతను లేడన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. వివాద రహితుడైన గౌతమ్ రెడ్డి.. మచ్చలేని మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు.






Tags:    

Similar News