కేసీఆర్, మోదీకి డైరెక్ట్ లైన్
బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రెండు పార్టీలు నాటకాలు మొదలుపెట్టాయని చెప్పారు
బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రెండు పార్టీలు నాటకాలు మొదలుపెట్టాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీ పట్ల వ్యతిరేకత ఉన్నట్లు నటిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. నెక్లస్ రోడ్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ లో కాలుష్యం ఎక్కువగా ఉందని రాహుల్ అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వస్తే టీఆర్ఎస్ సమర్థించిందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిచ్చిందని రాహుల్ తెలిపారు. మోదీ, కేసీఆర్ మధ్య డైరెక్ట్ లైన్ ఉంటుందన్నారు. మోదీ డైరెక్షన్ లోనే కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.
అన్నీ అమ్మేస్తున్నారు....
యువతకు ఉపాధి అవకాశాలు రెండు ప్రభుత్వాలు కల్పించడం లేదని రాహుల్ విమర్శించారు. యువత ఎంత పెద్ద చదువులు చదివినా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోదీ తన సన్నిహితులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎయిర్ పోర్టుల నుంచి ఎల్ఐసీ వరకూ అన్నింటినీ అమ్మేస్తున్నారన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను కూడా విపరీతంగా పెంచారన్నారు. పెట్రోలు ధరలు పెంచేసి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరుస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ...
రాహుల్ గాంధీ పాదయాత్రకు ఈరోజు ఏఐసీీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. నెక్లెస్ రోడ్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. రాహుల్ యాత్రకు అన్ని రాష్ట్రాల్లో మంచి స్పందన కనిపిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు రాహుల్ యాత్రతో మమేకం అవుతున్నారన్నారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందన్నారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని మల్లికార్జున ఖర్గే తెలిపారు. మోదీకి మరోసారి ప్రధాని అయ్యే అవకాశం, అర్హత లేదన్నారు. అంబేద్కర్, మహాత్మాగాంధీ ఆశయాల సాధనకోసమే కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు.