చివరి పిలుపు..వెళ్లొస్తా…నాన్నా

ఆయనది మధ్య తరగతి కుటుంబం….. అయినా నా పరిస్థితి పిల్లలకు రావొద్దని కష్టపడ్డాడు. రాత్రి, పగలు తేడా లేకుండా పిల్లల కోసం పనిచేశాడు. పిల్లలను బాగా చదివించాడు. [more]

Update: 2019-09-20 10:59 GMT

ఆయనది మధ్య తరగతి కుటుంబం….. అయినా నా పరిస్థితి పిల్లలకు రావొద్దని కష్టపడ్డాడు. రాత్రి, పగలు తేడా లేకుండా పిల్లల కోసం పనిచేశాడు. పిల్లలను బాగా చదివించాడు. వారు ప్రయోజకులయితే అంత కన్నా తండ్రి ఏం ఆశిస్తాడు. పిల్లల చదువుకోసం తన రెక్కలతో ఎన్నో కష్టాలు పడ్డాడు. కూతురుని ఇంజనీర్ ను చేశాడు. తాను పనిచేసే సంస్థలోనే కూతురును అధికారి హోదాలో చూడాలని ఎన్నో కలలు కన్నాడు. అలా జరిగితే తోటి ఉద్యోగుల ముందు కాలరెగరేవచ్చనుకున్నాడు. మరి ఏం జరిగింది…..?

సంతోషంతో…..

ఆయన అనుకన్నట్లే కూతురిని ఇంజినీర్ చదివించాడు…… కోరుకున్నట్లే ఆయన పనిచేసే సంస్థలో ప్రభుత్వ అధికారిగా కూతురు ఎంపికైంది. ఇంకేం కావాలి ఆ తండ్రికి. తోటి ఉద్యోగులు సైతం అభినందనలు తెలుపుతూ పొగుడుతుంటే ఆ సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ ఆనందాన్ని ఇంటికి తీసుకువచ్చి కుటుంబసభ్యులతో పంచుకున్నాడు. కాని విధి వక్రీకరించింది. ఆ సంతోషాలు ఎక్కువ రోజులు నిలవలేకపోయాయి. ఆ…ఆనందమైన కుటుంబంలో విషాదం నింపింది. ఇది ఈ నెల 15న గోదావరిలో బోటు ఘటనలో ఇంజనీర్ రమ్మ తండ్రి సుదర్శన్ వ్యధ.

చిరుద్యోగి గా….

తెలంగాణ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన సుదర్శన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్. ఆయన భార్య భూలక్షి. వీరికి ఇద్దరు సంతానం. రమ్య పెద్దకూతురు, రఘు చిన్నవాడు. సుదర్శన్ చిరు ఉద్యోగి కావడంతో కుటుంబాన్ని నడిపించడం కొంచెం కష్టతరమైంది. ఆయన పడుతున్న వేదన తన పిల్లలు పడకూడదనుకున్నాడు. అందుకే రెక్కలను ముక్కలు చేసుకుని విధులు నిర్వర్తించాడు. కూతురు రమ్యను బీటెక్ లో ఈఈఈ వరకూ చదివించాడు. రమ్య కూడా కుటుంబ పరిస్థితులను చూసి బాగా కష్టపడి చదివింది. దీంతో మంచి ర్యాంకు సాధించింది. ఇంతలోనే విద్యుత్ శాఖలో ఉద్యోగాలు పడడంతో దరఖాస్తు చేసింది. తండ్రి అనుకున్నట్లే విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ గా ఎంపికైంది. ఉద్యోగబాధ్యతలు చేపట్టింది. ఇదంతా నెలరోజుల క్రితం జరిగింది.

నెల జీతంతోనే ఆవిరైన జీవితం……

రమ్య మొదటి నెలరోజులు ఉద్యోగం చేసింది. వచ్చిన మొదటి జీతాన్ని తండ్రికి ఇచ్చింది. తండ్రి సైతం ఎంతో సంతోషించాడు. రమ్య కోరిక మేరకు మొదటి జీతంతో వినాయక చవితికి పూజలు చేయిస్తానని కోరడంతో తండ్రి ఆమె ఇష్టప్రకారమే చేశారు. మొదటి ప్రభుత్వం ఉద్యోగం, మొదటి జీతం వచ్చిన సందర్భంగా గణేష్ నిమజ్జనం రోజు బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ఇంటికి పిలిపించారు. అందరికీ సంతోషంగా విందు ఇచ్చారు. ఇలా అందరూ సంతోషంగా గడిపారు.

సమావేశంతో ఉండటంతో….

నూతనంగా ఎంపికైన సబ్ ఇంజినీర్ లకు విద్యుత్ శాఖ వరంగల్ లో సమావేశం నిర్వహించింది. ఈ సమవేశానికి రమ్య హాజరైంది. సమావేశం తరువాత తోటి ఉద్యోగులు కొత్త ఉద్యోగం వచ్చిన తరువాత విహారయాత్రకు వెళ్లాలనుకున్నారు. పాపికొండలు వెళ్లేందుకు తోటి ఇంజనీర్లు సిద్ధమయ్యారు. రమ్య సైతం తండ్రి సుదర్శన్ కు ఫోన్ చేసి పాపికొండలు వెళ్లోస్తా నాన్న అని చెప్పంది.

కొన్ని గంటలకే…….

రమ్య ఫోన్ చేసిన కొన్ని గంటలకే టీవీల్లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూశారు ఆమె తండ్రి సుదర్శన్. గోదావరిలో పడవ బోల్తాపడి అనేకమంది గల్లంతైనట్లు సమాచారం తెలిసింది. ఆ క్షణం నుంచే సుదర్శన్ కు కాళ్లు వణుకుపెట్టాయి. నోట మాట రావడం లేదు. నా చిట్టితల్లి ఎలా ఉందోనని పదే పదే ఫోన్ చేశారు కాని ఆ ఫోన్ మాత్రం మూగబోయింది.

పాపికొండలకు వెళ్లి…

ఘటనా స్థలికి చేరుకున్న సుదర్శన్ కుటుంబం రమ్య జాడ కోసం వాకబు చేశారు. కాని ఆమె గల్లంతైనప్పటికి మృతదేహం లభించలేదు. కాని సుదర్శన్ మాత్రం చేతికొచ్చిన కూతురుకు ఇలా జరుగుతుందని కలలోకూడా ఊహించుకోలేదు. బాగా చదివింది, ఉద్యోగం సంపాదించింది. ఇక పెళ్లి చేద్దామనుకుంటున్న తరుణంలోనే ఇంత విషాదం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ‘కోరుకున్న ఉద్యోగం సాధించావు.. మొదటి జీతాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టావు.. నిమజ్జనం రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపావు. స్నేహితులతో పాపికొండలు చూసొస్తా నాన్నా అంటే.. నా కూతురు సంతోషంగా గడపాలని పంపిస్తే.. ఆచూకీ కూడా తెలియని యాత్రకు పోతావని కలలో కూడా అనుకోలేదు కదా తల్లీ..’ అని కన్నీటి పర్యంతమైతే ఆయనను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఏళ్ల తరబడి కష్టపడి పెద్దచేసి సంతోషించే సమయంలోనే రమ్య కనిపించకపోవడాన్ని సుదర్శన్ తట్టుకోలేకపోతున్నారు. రమ్య కూడా తండ్రితో ఎక్కువ అటాచ్ మెంట్ ఉండేది. ఈ సంఘటన ప్రతిఒక్కరినీ కదిలించగా తల్లి భూలక్ష్మి పడుతున్న ఆవేదన చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన రమ్య మృతదేహం కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News