నేడు ఎమ్మెల్సీల అభ్యర్థుల ప్రకటన.. ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనుంది. 16 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనను ఒకేసారి చేయనుం;
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనుంది. 16 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనను ఒకేసారి చేయనుంది. స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం 16 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని అధినాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఎంపిక చేసే అవకాశముంది. అలాగే మహిళలకు కూడా అవకాశం కల్పించనున్నారని తెలిసింది.
పరిశీలనలో...
నెల్లూరు జిల్లా నుంచి మేరిగ మురళీధర్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. గూడురుకు చెందిన మురళీధర్ ను జగన్ స్వయంగా ఎంపిక చేశారంటున్నారు. ఇక కడప నుంచి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి (జమ్మలమడుగు) తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళ వెంకట రమణ ( మజీ ఎమ్మెల్యే, కైకలూరు), అనంతపురం జిల్లా నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు గంగాధర్ లేదా ఆయన సతీమణి లేకుంటే హిందూపురానికి చెందిన నవీన్ నిశ్చల్, రజక కార్పొరేషన్ ఛైర్మన్ గంగన్న పేర్లను ఖరారు చేసే అవకాశముంది.
16 మందితో జాబితా...
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వంకా రవీంద్ర లేదా నాగబాబులో ఒకరిని ఎంపిక చేశారని సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావు, డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఎస్.సి.వి. నాయుడు, డాక్టర్ సిపామయి సుబ్రహ్మణ్యం, యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, జంకె వెంకటరెడ్డి, బొప్పన భవకుమార్ తో పాటు ముస్లింలలలో ఒకరి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 16 మందిని ఈరోజు ఎంపిక చేస్తారని తెలిసింది.