దటీజ్ స్టాలిన్... రాజీ పడరంతే
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయనతో కలసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూటే వేరు. ఆయన దేనికదే చూస్తారు. రాజకీయాలు రాజకీయాలే. తమిళనాడు అభివృద్ధి అభివృద్ధి. రెండింటికీ ముడిపెట్టే తత్వం కాదు స్టాలిన్‌ది. ఒకరకంగా తమిళనాడు ఏలిన నేతలంతా అలాగే ఉంటారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదాలున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారు. రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీలు ఉమ్మడి పోరాటాలు చేసిన సందర్భాలు అనేకం. జయలలిత, కరుణానిధి ఇద్దరూ వ్యక్తిగతంగా, రాజకీయంగా బద్ధశత్రువులైనా అది రాజకీయాల వరకే. రాష్ట్ర సమస్యలపై అందరూ ఒక్కటవుతారు. రాజకీయాలను, రాష్ట్రాన్ని వేరు చేసి చూడటం వల్లనే తమిళనాడు జాతీయ పార్టీలు బలపడలేదన్నది అంతే వాస్తవం.
తంబీలంటే అంతే...
ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అంతే. దేనికదే. గవర్నర్ తో పొసగదు. తెలంగాణలో మాదిరిగా అక్కడ గవర్నర్ ఆర్ఎస్ రవి రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగానే మారారు. అనేక బిల్లుల విషయంలో కొర్రీలు పెట్టారు. గవర్నర్ పై ఆందోళనకు కూడా అధికార పార్టీ డీఎంకే ఆందోళనకు దిగింది. బడ్జెట్ సమావేశానికి గవర్నర్ ను ఆహ్వానించింది. తాము చెప్పని విషయాలను గవర్నర్ ప్రసంగంలో వచ్చే సరికి వాకౌట్ చేసింది. అలా ఉంటుంది మరి తంబీలతోని. గవర్నర్ పై రాష్ట్రపతి, ప్రధానిలకు ఫిర్యాదు చేసినా ఏం కాదని తెలిసినా సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి గవర్నర్‌పై కంప్లయింట్ చేసి వస్తారు. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి వెనుకాడరు.
కేసీఆర్ మాత్రం...
తెలంగాణలో అలా కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మోదీ తెలంగాణ వచ్చినప్పటికీ ఆయనకు స్వాగతం పలకలేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కనీసం మోదీ మొహం చూసేందుకు కూడా ప్రయత్నించరు. కనీసం ప్రధానిని కలిసి తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలను ఇస్తే అవి నెరవేరతాయా? లేదా? అన్నది పక్కన పెడితే తాము రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలి కదా? అన్న ప్రశ్న తలెత్తుంది. చెరువు మీద అలిగి.. సామెత ఖచ్చితంగా కేసీఆర్‌కు వర్తిస్తుంది. ఎవరికి నష్టమని తెలంగాణ ప్రజలు ప్రశ్నించే అవకాశముంది. గతంలో చంద్రబాబు కూడా ప్రధాని మోదీని వ్యతిరేకించినప్పుడు ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలు అంతే ఉంటారు.
సోషల్ మీడియాలో...
కానీ ఈరోజు తమిళనాడు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి స్టాలిన్ విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. ఆయనతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానికి స్టాలిన్ స్వయంగా ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం పూర్తయినంత వరకూ ఆయన వెంటే ఉన్నారు. తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌కు నమ్మకమైన మిత్రుడిగా నేటికి కొనసాగుతుంది. రాహుల్ ను ప్రధాని కావాని పలుమార్లు బహిరంగంగా స్టాలిన్ ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే మోదీ వచ్చినప్పుడు ఆయనను కలసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించి ఆయనకు వినతి పత్రం అందచేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుపై పోలికలు నెట్టింట జోరుగానే సాగుతున్నాయి.