Tirumala : తిరుమలలో ఏడాది చివరి రోజు రద్దీ ఎలా ఉందంటే?

ఈరోజు దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నందున తిరుమల క్షేత్రంలో నేడు భక్తుల రద్దీ బాగా తగ్గింది

Update: 2024-12-31 03:24 GMT

తిరుమలలో ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతుంది. వీధులన్నీ నిండిపోయి కనిపిస్తాయి. కానీ రెండు రోజుల నుంచి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఏడాది చివరి రోజు కావడంతో ఎక్కువ మంది తిరుమలకు రాలేదని అధికారులు తెలిపారు. ఈరోజు దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నందున తిరుమల క్షేత్రంలో నేడు భక్తుల రద్దీ బాగా తగ్గింది. కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఈరోజు తిరుమలకు వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం సులువుగానే పూర్తవుతుంది. భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి వద్దకు వెళ్లే వీలవుతుంది. అదే సమయంలో స్వామి వారి చెంత కూడా కొద్దిసేపు ఉండేందుకు నేడు ఉపయోగపడుతుంది. భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో సిబ్బంది కూడా తనివితీరా వైకుంఠవాసుడిని చూసి తరించేందుకు అవకాశమిస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి తిరుమల క్షేత్రంలో గడపాలని వచ్చే వారు కూడా అనేక మంది ఉన్నారు. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా రష్ లేని సమయంలోనే వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం అనిర్వచనీయమైన అనుభూతి అంటూ గోవింద నామస్మరణలతో భక్తులు ఊగిపోతున్నారు.

ఆరుగంటల సమయం...
తిరుమల క్షేత్రానికి నేటి రాత్రికి రద్దీ పెరిగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభం రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచిదని చాలా మంది భావిస్తారు. అందుకే ఈరోజు రాత్రి నుంచి భక్తుల రాక ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని అంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఆరు గంటల సమయం శ్రీవారి దర్శనం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయంలో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం నేడు రెండుగంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,298 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 16,544 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.10 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News