కేసీఆర్‌ ఆగుతుంది ఎందుకో?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసాగా ఉన్నట్లున్నారు. మూడోసారి కూడా తనదే విజయమన్న నమ్మకంతో ఉన్నారు.

Update: 2023-04-09 07:18 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసాగా ఉన్నట్లున్నారు. మూడోసారి కూడా తనదే విజయమన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే పెద్దగా తెలంగాణ పాలిటిక్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ గులాబీ బాస్‌ కార్యాచరణలోకి దిగలేదు. జిల్లాల పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో ఒకరోజు హడావిడి చేయడం తర్వాత ప్రగతి భవన్‌కే పరిమితమవ్వడం మామూలయి పోయింది. పోనీ ప్రభుత్వంపై సానుకూలత ఎనలేనంత ఉందా? అంటే ఉందని ఖచ్చితంగా లేదని చెప్పలేం. ఎందుకంటే నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఇలా అన్ని సామాజికవర్గాల్లో అసంతృప్తి ఉందని పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉంది.

ప్రగతి భవన్‌కే...

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు పెద్దగా ప్రయత్నాలు కేసీఆర్ చేయడం లేదంటున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేసిన తర్వాత దేశ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ రాజకీయాలను తన కుమారుడు మంత్రి కేటీఆర్, అల్లుడు మరో మంత్రి హరీశ్‌రావులుకు వదిలేశారు. వారిద్దరే జిల్లాల్లో జోరుగా పర్యటనలు చేస్తున్నారు. అంతే తప్ప పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం తెలంగాణ ఎన్నికలపై ఇంకా సీరియస్‌గా దృష్టి సారించక పోవడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికలకు పట్టు మని ఏడు నెలల సమయం కూడా లేదు. అయినా కేసీఆర్ ఎందుకు నిర్లిప్తత ధోరణిని వ్యవహరిస్తున్నారంటే ఆయన లెక్కలు ఆయనకున్నాయనే వారు లేకపోలేదు.
రెండు పార్టీలు చీల్చుకుంటే...
ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్, బీజేపీలు చీల్చుకుంటే సులువుగా మూడోసారి అధికారంలోకి రాగలమన్న అతి విశ్వాసంతో కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలు ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టేవిగా కనపడుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వంపై ఉన్న రెపుటేషన్ దెబ్బతినిందనే చెప్పాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా సంతృప్తికరంగా లేరు. ఆ విషయం తెలిసినా రెండు పార్టీలు వ్యతిరేక ఓటు చీల్చుకుంటే అనుకూల ఓటుతో గెలుపొందుతామన్న ధోరణి కేసీఆర్‌లో కనపడుతుంది. అందుకే బీజేపీ బలపడేలా ఆయన గత కొంతకాలంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బంది పడేలా చేశారు. ఇది రాజకీయంలో ఒక వ్యూహమే కావచ్చు. ఆయన స్ట్రాటజీతో సానుకూల ఫలితాలు రావచ్చు. అలాగని ప్రతికూల ఫలితాలు రావని ఖచ్చితంగా చెప్పలేం.
ఏమో చెప్పలేం...
ఎందుకంటే బీజేపీ పైకి బలంగా కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో దాని పరిస్థితేంటో తెలియదు. 119 నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకులేని బీజేపీ కాంగ్రెస్‌తో పోటీ పడుతుందా? చతికలపడుతుందా? అన్నది రానున్న ఎన్నికలు తేల్చి చెబుతాయి. అనుకున్న స్థాయిలో బీజేపీ బలంగా లేదన్నది మాత్రం వాస్తవం. అయితే కాంగ్రెస్ కూడా అంతే. క్షేత్రస్థాయిలో బలం ఉన్నా నేతల మధ్య ఐక్యత లేదు. అది కేసీఆర్‌కు అడ్వాంటేజీ. అలా కాకుండా ఇప్పుడు కాక మరింకెప్పుడు అని ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త అనుకుంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద లెక్క కాబోదు. కాంగ్రెస్ కనుక పుంజుకుంటే కేసీఆర్ కూడా రాజకీయంగా ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే ఇది తెలంగాణ. రాజకీయ చైతన్యం ఎక్కువ. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు సహజంగానే అసంతృప్తి కొన్ని వర్గాల్లో ఉంటుంది. ఆ అసంతృప్తిని సమర్థవంతంగా కాంగ్రెస్‌ కనుక క్యాష్ చేసుకోగలిగి తమకు అనుకూలంగా మార్చుకోలిగితే చెప్పలేం. గుర్రం ఎగరా వచ్చు. కేసీఆర్ ఆశలు అడియాస కావచ్చు. హ్యాట్రిక్ విక్టరీ దూరం కావచ్చు. కానీ ఇవన్నీ జరగాలంటే.. చాలా జరగాలి. మరి అవి జరుగుతాయో? లేదో? అన్నది కూడా చూడాల్సి ఉంది.


Tags:    

Similar News