నేటికి నాలుగేళ్లు పూర్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నాలుగేళ్లు పూర్తయింది. రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు నాలుగేళ్లు పూర్తయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2019 లో ఎన్నికలు జరగాల్సి ఉండగా తొమ్మిది నెలలు ముందుగానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. అయితే రెండోసారి అఖండ విజయాన్ని కేసీఆర్ సాధించారు. 2018 డిసెంబరు 13వ తేదీన మరోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. రెండోసారి అధికారంలో చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు.
ధరణి పోర్టల్ ....
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ను తెచ్చి భూ సమస్యల పరిష్కారానికి కొంత కృషి చేయగలిగారు. రెవెన్యూ శాఖలో వివిధ సంస్కరణలు తెచ్చారు. ఇక దళితబంధు పథకాన్ని తెచ్చి కొన్ని నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇక నిరుద్యోగులకు వరసగా గుడ్ న్యూస్ లు చెబుతూనే ఉన్నారు. అన్ని శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారు. ఇక కరోనాతో రెండేళ్ల పాటు ఆర్థికంగా ఇబ్బంది పడినా సంక్షేమ పథకాల అమలును ఆపలేదు.
ఉప ఎన్నికల్లో...
నాలుగేళ్లలో రెండుసార్లు మంత్రి వర్గ విస్తరణ చేసిన కేసీఆర్ వచ్చే ఏడాది మూడో దఫా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉప ఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో మూడు చోట్ల పార్టీని విజయపథాన నడిపారు. కొత్త మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి కూడా ఈ నాలుగేళ్లలో నడుంబిగించారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు.