ఇద్దరూ తగ్గట్లేదుగా..?
తెలంగాణ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటికీ దీనికి తెరపడే అవకాశాలు కన్పించడం లేదు
తెలంగాణ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటికీ దీనికి తెరపడే అవకాశాలు కన్పించడం లేదు. మొన్నటి వరకూ పరోక్షంగా నేడు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలకు, వీరికి సంబంధం లేకపోయినా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరి వ్యవహారశైలి హీట్ పుట్టిస్తూనే ఉంది. ప్రభుత్వం ఆమోదం కోసం పంపిన అనేక బిల్లులను రాజ్ భవన్ లో తొక్కి పెడుతున్నారని అధికార బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే సమయంలో గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టును కూడా తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది.
తెగదు ... తెల్లారదని...
ఢిల్లీ పెద్దలకు గవర్నర్ వ్యవహారం చెప్పినా తెగదు.. తెల్లారదని తెలిసి న్యాయస్థానంలో తేల్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధమయింది. న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చే ముందే గవర్నర్ కార్యాలయం కొన్ని బిల్లులను ఆమోదించడం, మరికొన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం, మరికొన్నింటిని తిరస్కరించడం జరిగిపోయాయి. న్యాయస్థానం కూడా గవర్నర్ విషయంలో జోక్యం చేసుకోలేని పరిస్థితి కావడంతో బిల్లుల విషయంలో ఎటూ తేలకుండానే ఉంది. ముఖ్యమైన బిల్లులను తొక్కి పెట్టి తమకు పాలనలో అడుగడుగునా అడ్డుకుంటున్నారని అధికార పార్టీ ఆరోపిస్తుండగా, అదేమీ లేదని ప్రజలకు అనుకూలంగా ఉండేలా పూర్తి స్థాయిలో బిల్లులను అథ్యయనం చేసిన తర్వాతనే ఆమోదిస్తున్నామని గవర్నర్ కార్యాలయం తరచూ చెబుతూ వస్తుంది.
సచివాలయం ప్రారంభానికి...
తాజాగా ఇటీవల కొత్త సచివాలయం ప్రారంభానికి రాష్ట్ర ప్రధమ పౌరురాలిగా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వస్తారని అందరూ భావించారు. అందరికీ ఆహ్వానాలు పంపామని మంత్రులు కూడా తెలిపారు. కానీ సచివాలయం ప్రారంభానికి గవర్నర్ గైర్హాజరయ్యారు. అయితే తనకు ఆహ్వానం లేకపోవడంతోనే రాలేకపోయానని, తనకు ఆహ్వానం పంపకపోతే తాను ఎలా హాజరవుతానని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. అంటే మంత్రుల కామెంట్స్ కు ధీటుగా రాజ్ భవన్ సీరియస్ గానే స్పందించిందని అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ గవర్నర్ రాష్ట్ర పర్యటనకు వెళ్లాలంటే ప్రొటోకాల్ పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. తమిళిసైకు హెలికాప్టర్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆమె రోడ్డు, రైలు మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నారు.
నేరుగానే విమర్శలు...
ఇక ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. కొంతమంది మాట్లాడతారే కాని పనిచేయరని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం రేగింది. దేశాధినేతలనయినా సులువుగా కలవొచ్చేమో కాని ఈ స్టేట్ చీఫ్ ను మాత్రం కలవడం సాధ్యం కాదని తమిళిసై అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈవ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ , రాజభవన్ దూరంగా ఉన్నాయని తెలిపారు. దీంతో మరోసారి గవర్నర్ వర్సెస్ కేసీఆర్ మధ్య వివాదం కంటిన్యూ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఇక ఎన్నికల వరకూ ఇలాంటి వ్యాఖ్యలు ఎన్ని వినాల్సి వస్తుందోనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాస్తవాలు మాట్లాడితే ఉలుకెందుకని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.